- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బల్దియాలో కార్పొరేటర్ల లాస్ట్ మినిట్ ఫైట్.. రేపటితో ముగియనున్న పదవీకాలం!
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం రేపటితో ముగియనుంది. చివరి నిమిషంలో పనుల అనుమతులు, అవుట్ సోర్సింగ్ నియామకాల కోసం కార్పొరేటర్లు చేస్తున్న ప్రయత్నాలు బల్దియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

దిశ, వరంగల్ బ్యూరో: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం రెండు రోజుల్లో ముగుస్తుండటంతో అన్నీ ఒప్పందాలు, అడ్జస్ట్మెంట్పేరిట అనుమతులు తీసుకుంటున్నారు. అభివృద్ధి పనుల టెండర్లను పిలవడం తో పాటు తమ డివిజన్ల పరిధిలో భవనాలు, ఇతర పనులకు అనుమతులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. మళ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాల్సి ఉండడంతో అధికారులపై ఒత్తిడి తెస్తూ పనులను పూర్తి చేసుకుంటున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం పట్టుబట్టడంతో పాటు చివరి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. పాలకవర్గం పదవీకాలం ముగుస్తుండటంతో మంత్రి, ఎమ్మెల్యేలు పట్టు బిగిస్తున్నారు.
రేపటితో ముగియనున్న పదవీకాలం..
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక సభ్యుల పదవీకాలం ఈనెల 6వ తేదీ పూర్తవుతుంది. ఐదేళ్ల పదవీకాలం పూర్తి కానుండటంతో కార్పొరేటర్లు పనులపై దృష్టి పెడుతున్నారు. తమ డివిజన్ల పరిధిలోని పనుల కోసం అన్ని అనుమతులు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే వాటికి ఒప్పందాలు చేసుకోవడంతో పాటు పనులు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ఐదేళ్లలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు తంటాలు పడుతున్నారు. చివరి నిమిషంలో ఆదాయం వచ్చే పనులపైన నజర్ పెడుతున్నారు. పనులకు టెండర్లు పిలిపించడంతో పాటు నామినేటెడ్ పద్ధతిలో పనులను చేసే విధంగా చూసుకుంటున్నారు. వాటికి సంబంధించిన పనులకు కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఇక రెండే రోజులు పదవి కాలం ఉండటంతో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పదవీ కాలం పూర్తయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలు కానుండడంతో ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత మంది ఎమ్మెల్యేల ద్వారా కూడా సిఫారసు చేయించుకుంటున్నారు. పనులకు ఎక్కువగా అనుమతులు వచ్చే విధంగా చూసుకుంటున్నారు.
చూసీచూడనట్టుగా అధికారులు..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుల పదవీకాలం రెండు రోజుల్లో పూర్తి కానుండటంతో అధికారులు కూడా చూసీచూడనట్లు గా వ్యవహరిస్తున్నారు. అవసరమైన పనులకు మాత్రమే అనుమతులు ఇస్తున్నారు. అన్ని రకాల పనులను పరిశీలించడంతో పాటు నిధులకు అనుగుణంగా పనులను కేటాయిస్తున్నారు. పదవీకాలం పూర్తవుతుండటంతో ఆచితూచి అనుమతులు మంజూరు చేస్తున్నారు. గతంలో రూ.66 కోట్లకు పనులకు టెండర్లు రీకాల్ చేయగా కార్పొరేటర్లు ఒత్తిడి తెచ్చిన నిబంధనలకు అనుగుణంగానే అనుమతులు మంజూరు చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ లో 250కి పైగా అవుట్ సోర్సింగ్ పోస్టులకు అనుమతులు ఇచ్చారు. చెత్త సేకరణ, ఇతర పనులకు వీరిని వినియోగించనున్నారు. అన్ని డివిజన్ల పరిధిలో ఖాళీలు ఉండటంతో పదవీకాలం పూర్తవుతున్న కార్పొరేటర్లు ఈ పోస్టుల భర్తీ కోసం భారీగా పైరవీలు చేశారు. నిరుద్యోగుల నుంచి డబ్బులను కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఆపోస్టులను భర్తీ చేయడం లేదు.
మంత్రి, ఎమ్మెల్యేల నజర్..
మున్సిపల్ కార్పొరేషన్ పై మంత్రి, ఎమ్మెల్యేలు నజర్ పెట్టారు. అధికారుల పాలన మొదలు కానుండటంతో పట్టు బిగిస్తున్నారు. తమ ఆధ్వర్యంలోనే పనులు జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అభివృద్ధి పనులకు టెండర్లు పిలవడం తో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల భర్తీ వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే చేసేందుకు సిద్ధమవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు అనుకూలమైన అధికారిని తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా పాలకవర్గం పదవీకాలం ముగుస్తుండగా స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలవుతుంది. రెండు రోజుల్లో పదవీకాలం ముగుస్తున్న కార్పొరేటర్లు మాత్రం చివరి నిమిషంలో ప్రయత్నాలు చేస్తున్నా వారికి అనుకూలమైన పనులను మాత్రం జరగడం లేదు.






