సేంద్రియ సాగులో ‘లక్ష్మీపురం’ రైతు అద్భుతం.. కలెక్టర్ ప్రశంసలు!

by Nallavelli.Anjaneyulu |

రసాయన ఎరువులు, పురుగుల మందులు లేని వ్యవసాయం సాధ్యమేనా? అంటే.. సాధ్యమేనని నిరూపిస్తున్నాడు బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు లక్ష్మీరెడ్డి.

సేంద్రియ సాగులో ‘లక్ష్మీపురం’ రైతు అద్భుతం.. కలెక్టర్ ప్రశంసలు!
X

​దిశ, బూర్గంపాడు : రసాయన ఎరువులు, పురుగుల మందులు లేని వ్యవసాయం సాధ్యమేనా? అంటే.. సాధ్యమేనని నిరూపిస్తున్నాడు బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు లక్ష్మీరెడ్డి. గత 15 ఏళ్లుగా పూర్తిగా ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లోనే పంటలు పండిస్తూ, పర్యావరణ హిత వ్యవసాయానికి ఆయన కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. మంగళవారం ఆయన కలెక్టర్‌ను కలిసి తాను పండించిన ఆర్గానిక్ మిర్చిని చూపించగా.. కలెక్టర్ ఆయన కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ​సాధారణంగా ఏ పంట వేసినా బస్తాల కొద్దీ ఎరువులు వాడటం ఈ రోజుల్లో పరిపాటి.కానీ లక్ష్మీరెడ్డి మాత్రం 2009 నుంచి ఇప్పటివరకు ఒక్క బస్తా ఎరువు కానీ, క్రిమిసంహారక మందులు కానీ వాడలేదు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తూ ఆరోగ్యకరమైన దిగుబడిని సాధిస్తున్నారు. గత మూడేళ్లుగా 341 రకం ఆర్గానిక్ మిర్చిని పండిస్తూ ఇతర రైతులకు మార్గదర్శకంగా మారారు.

కలెక్టర్ అభినందన.. తోట సందర్శనకు హామీ

లక్ష్మీపురం​ మాజీ సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మీరెడ్డి కలెక్టర్‌ను కలిశారు. లక్ష్మీరెడ్డి సాగు పద్ధతులను విన్న కలెక్టర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఇలాంటి పద్ధతులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని కొనియాడారు.రెండు మూడు రోజుల్లో సమయం చూసుకుని స్వయంగా లక్ష్మీరెడ్డి తోటను సందర్శిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. వచ్చే ముందు పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డికి సమాచారం అందిస్తానని పేర్కొన్నారు.​ గతంలోనే లక్ష్మీరెడ్డి సాధిస్తున్న విజయాలు ఈనాటివి కావు. గతేడాది భద్రాచలం ఐటీడీఏ పీవో స్వయంగా ఆయన తోటను సందర్శించి అభినందించగా,రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్ ద్వారా లక్ష్మీరెడ్డిని అభినందించి ప్రోత్సహించారు. లక్ష్మీరెడ్డితో పాటు అదే గ్రామానికి చెందిన మేడిపల్లి ఉదయ్ అనే మరో రైతు కూడా సేంద్రియ సాగులో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలో ఒక విశేష ఆకర్షణగా మారిన ఈ ఆర్గానిక్ తోటలను చూడటానికి ఇతర ప్రాంతాల రైతులు తరలివస్తున్నారు. ప్రభుత్వ పెద్దల మద్దతు లభిస్తుండటంతో, బూర్గంపాడు మండలంలో సేంద్రియ సాగు మరింత విస్తరించే అవకాశం కనిపిస్తోంది.

Next Story