రూ.580 కోట్లు సైబర్ క్రైమ్.. 14 మంది అరెస్ట్.. 8 మంది పరారీ

by Batti.Sumithra |   (  Updated:2026-02-24 11:16:46  IST  )

రూ.547 కోట్ల సైబర్ స్కామ్‌కు సంబంధించి ఈ ఏడాది జనవరి 11న వీయం బంజర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు గురించిన వివరాలను కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.

రూ.580 కోట్లు సైబర్ క్రైమ్.. 14 మంది అరెస్ట్.. 8 మంది పరారీ
X

దిశ, సత్తుపల్లి : రూ.547 కోట్ల సైబర్ స్కామ్‌కు సంబంధించి ఈ ఏడాది జనవరి 11న వీయం బంజర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ప్రధాన నిందితుడు ఉడతనేని వికాస్ చౌదరిని అరెస్టు చేసి సత్తుపల్లి కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. మంగళవారం సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సోమవారం సైబర్ నేరంలో మోసపోయిన ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. దర్యాప్తులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామానికి చెందిన ఉడతనేని వికాస్ చౌదరి, అతని భార్య బొప్పన నాగప్రియ, అడపా రామ వెంకట చరణ్ చౌదరి అలియాస్ చరణ్ కలిసి 2020 నుంచి ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, క్రిప్టోకరెన్సీ పేర్లతో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. విదేశాల్లో ఉన్న కొందరితో కలిసి కాల్ సెంటర్లు నడుపుతూ దేశంలోని ప్రజలకు ఫోన్ చేసి అధిక లాభాలు వస్తాయని నమ్మబలికేవారని చెప్పారు. ఆసక్తి చూపిన వారిని టెలిగ్రాం గ్రూపుల్లో చేర్చి వివిధ లింకులు, క్యూఆర్ కోడ్‌లు పంపి వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మోసపూరితంగా తీసుకునేవారని వెల్లడించారు.

అదేవిధంగా స్టాక్ ట్రేడింగ్ చేస్తున్నట్లు చెప్పి పలువురి పేర్లతో బ్యాంకుల్లో కరెంట్ ఖాతాలు తెరవించుకుని, ఖాతా తెరిచిన వారికి నెలకు రూ.50 వేల జీతం, ఒక్క ఖాతాకు రూ.20 వేల ప్రోత్సాహకం ఇస్తామని చెప్పేవారని తెలిపారు. చరణ్ ద్వారా మొత్తం 22 మందితో ఖాతాలు తెరవించుకుని వారికి ఒక్కొక్కరికి రూ.10 వేలిచ్చి, తాను రూ.20 వేల కమిషన్ తీసుకున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడన్నారు. చరణ్ ఇచ్చిన సమాచారం మేరకు సోమవారం రాత్రి 12 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని, మొత్తం 14 మందిని రిమాండ్‌కు తరలించామని చెప్పారు. అరెస్టైన వారిలో ఉడతనేని వికాస్ చౌదరి, అడపా రామ వెంకట చరణ్ చౌదరి, అడపా సూర్యవెంకట తరుణ్, సారపు అనిరుద్, పోట్రు వంశీ, పోట్రు చైతన్య సాయి, దోసపాటి నవీన్, నల్లబోతుల భవాని సత్య శేఖర్, కాపుగంటి జోగేంద్ర శేషు, దేవుళ్ల వేణు, మామిడిశెట్టి సాయికుమార్, పటాన్ ఇమ్రాన్ ఖాన్, ఉప్పతల గోపి, దొబ్బల వెంకటేష్ ఉన్నారని తెలిపారు. ఇంకా బొప్పన నాగ ప్రియ, ఇస్లావత్ లక్ష్మీ కళ్యాణం, శీలం వేణుగోపాలరావు, నల్లగుల శ్వేత, వీరంశెట్టి వంశి, బిల్లా సాయి తరుణ్, సంగం ప్రవీణ్ కుమార్, భూక్య తరుణ్ పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఏసీపీ పేర్కొన్నారు.

Next Story