- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సార్ వచ్చారు : జిల్లా రవాణాశాఖ అధికారిగా జగదీష్
జిల్లా రవాణాశాఖ అధికారిగా (ఆర్‌టీఓ) గత ఏడాది నవంబర్‌లో బాధ్యతలు చేపట్టిన ధర్మపురి జగదీష్ మూడు రోజులకే శిక్షణకు వెళ్లారు.

దిశ, ఖమ్మం కార్పొరేషన్ : జిల్లా రవాణాశాఖ అధికారిగా (ఆర్‌టీఓ) గత ఏడాది నవంబర్‌లో బాధ్యతలు చేపట్టిన ధర్మపురి జగదీష్ మూడు రోజులకే శిక్షణకు వెళ్లారు. శిక్షణ అనంతరం శనివారం ఆయన తిరిగి ఆర్‌టీఓగా బాధ్యతలు స్వీకరించారు. చాలా రోజుల తర్వాత ఖమ్మం జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి పూర్తిస్థాయి అధికారి రావడం గమనార్హం. ఇటీవల రవాణాశాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగి అవినీతి బట్టబయలైన నేపథ్యంలో, పూర్తిస్థాయి అధికారిగా వచ్చిన జగదీష్ కార్యాలయంలో పాలనను గాడిలో పెడతారా అనే ప్రశ్న ప్రజల్లో నెలకొంది. ఇప్పటివరకు జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో అవినీతి రాజ్యమేలుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లకే జిల్లా రవాణాశాఖ అధికారిగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో పనులు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసే స్థాయికి పరిస్థితి వెళ్లిందంటే ఈ కార్యాలయ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
గతంలో జిల్లా రవాణాశాఖ పూర్తిస్థాయి అధికారిణిగా వచ్చిన ఓ మహిళా అధికారి ఇక్కడి ఒత్తిడిని తట్టుకోలేక మూడు రోజుల్లోనే వెళ్లిపోయారు. ఆ తర్వాత మరో పూర్తిస్థాయి అధికారిని నియమించగా, ఆయన శిక్షణ పేరుతో వెళ్లిపోయారు. శిక్షణకు వెళ్లిన అధికారి జగదీష్ తిరిగి బాధ్యతలు నిర్వర్తిస్తారా అన్న అనుమానాలు ఉండగా, శనివారం ఆయన ఆర్‌టీఓగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఏజెంట్లు, ప్రైవేట్ వ్యక్తుల దందాలకు చెక్ పడుతుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదికాలంలోనే ఇద్దరు పూర్తిస్థాయి అధికారులు రావడం–పోవడం జరగడంతో, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లకు (ఎంవీఐ) ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ వారిని తరచుగా మార్చడం జరుగుతోంది. 2024లో రవాణా శాఖ పూర్తిస్థాయి అధికారిగా ఆఫ్రిక్ సిద్ధిఖి వచ్చారు. ఆమె డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియమితులయ్యారు.
నిబంధనల ప్రకారం కఠినంగా పనిచేయడంతో ఆమెపై ఒత్తిడి పెరిగినట్లు బహిరంగ వ్యాఖ్యలు వినిపించాయి. ముఖ్యంగా ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ విషయంలో ఆమె నిక్కచ్చిగా వ్యవహరించడంతో కొంతమందికి అది మింగుడు పడలేదు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనైన సదరు అధికారిణి నెల రోజుల్లోనే దీర్ఘకాలిక సెలవు పై వెళ్లిపోయారు. అనంతరం ఎంవీఐ వాకదాని వెంకటరమణకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ధర్మపురి జగదీష్ పూర్తిస్థాయి ఆర్‌టీఓగా రాగా, కేవలం మూడు రోజులు మాత్రమే విధులు నిర్వహించి శిక్షణకు వెళ్లిపోయారు. తదనంతరం వైరా ప్రాంతీయ కార్యాలయంలో పనిచేసే ఎంవీఐ వరప్రసాద్‌కు ఆర్‌టీఓ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం పూర్తిస్థాయి ఆర్‌టీఓగా జగదీష్ బాధ్యతలు చేపట్టారు.
ఎంతో ముఖ్యమైన శాఖ..
జిల్లా రవాణాశాఖ ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూర్చే కీలక శాఖ. వాహనాల రిజిస్ట్రేషన్లతో పాటు వాహనాల ఫిట్‌నెస్ తనిఖీలు, ఓవర్‌లోడ్ నియంత్రణ వంటి ముఖ్యమైన బాధ్యతలు ఈ శాఖకు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో పర్యవేక్షణ లోపించి, లంచాలు ఇచ్చినవారికే పనులు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయంలో పనిచేసే కొందరు ఉద్యోగులు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకున్నట్లు ఏసీబీ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు జరుగుతున్న సమయంలోనే ఒక స్కూల్ బస్సులో పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్లడం, ఆ బస్సుకు ప్రమాదం జరగడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ప్రస్తుతం జిల్లాకు పూర్తిస్థాయి రవాణాశాఖ అధికారి రావడంతో అవినీతి, అలసత్వానికి చెక్ పడుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.






