ప్రాణాల కంటే ఉత్పత్తే ముఖ్యమా..?

by Kodari Anjali |

సింగరేణిలో భద్రతా పరికరాల కొరతపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రాణాల కంటే ఉత్పత్తే ముఖ్యమా..?
X

దిశ, కొత్తగూడెం సింగరేణి: దేశానికి బొగ్గు అందించే ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థ సింగరేణిలో ఉత్పత్తి లక్ష్యాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో, కార్మికుల ప్రాణ భద్రతకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తున్నారా..? అనే ప్రశ్నలు తాజాగా కార్మిక వర్గంలో బలంగా వినిపిస్తున్నాయి. గనుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు అవసరమైన వ్యక్తిగత భద్రతా పరికరాలు (పీపీఈ) పూర్తిస్థాయిలో అందడం లేదని కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు భద్రతా ప్రమాణాలపై సమావేశాల్లో పెద్ద పెద్ద మాటలు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాటి అమలు కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు.

పని స్వభావానికి తగ్గ భద్రతా పరికరాలే లేవా..?

భూగర్భ గనులు, ఓపెన్‌కాస్ట్ గనులు, వర్క్‌షాపులు, థర్మల్ పవర్ ప్లాంట్లు, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. భారీ యంత్రాల మధ్య పని చేయడం, విద్యుత్ మరమ్మతులు, వెల్డింగ్, ఎత్తైన ప్రాంతాల్లో పనులు, బొగ్గు ధూళిలో విధులు నిర్వహించే వారికి అవసరమైన ఇంపాక్ట్ గ్లోవ్స్, కట్ రెసిస్టెంట్ గ్లోవ్స్, ఎలక్ట్రికల్ ఇన్సులేటెడ్ గ్లోవ్స్, ఫుల్ బాడీ హార్నెస్‌లు, నాణ్యమైన మాస్కులు, సేఫ్టీ గ్లాసెస్, ఎలక్ట్రికల్ సేఫ్టీ టూల్స్ వంటి కీలక భద్రతా పరికరాలు తగినంతగా అందడం లేదని కార్మికులు చెబుతున్నారు.

ప్రమాదాలు జరిగినా మారని పరిస్థితి...

సింగరేణి చరిత్రలో అనేక ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నప్పటికీ, ప్రతి ఘటన తర్వాత భద్రతపై సమీక్షలు, ఆదేశాలు, హెచ్చరికలు మాత్రమే మిగిలిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకుని భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పులు కనిపించడం లేదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.

గుర్తుకొస్తున్న విషాద ఘటనలు

సింగరేణిలో జరిగిన పలు ప్రమాదాలు ఇప్పటికీ కార్మికులను వెంటాడుతున్నాయి. 2006 నవంబర్ 12న భూగర్భ గనిలో బొగ్గు తవ్వకాల సమయంలో సుమారు నాలుగు మీటర్ల వెడల్పుతో పైకప్పు రాయి కూలిపోవడంతో ఒక అండర్ మేనేజర్, ఒక ఓవర్‌మెన్, ఇద్దరు కార్మికులు కలిపి నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. పీవీకే గనిలో బొగ్గు తవ్వకాల సమయంలో తలపై బొగ్గు పడటంతో జయపాల్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇదే గనిలో గతంలో కూడా పైకప్పు కూలి కార్మికులు గాయపడిన ఘటనలు నమోదయ్యాయి. మణుగూరు ఏరియా పీకే ఓసీలో డంపర్ యార్డులో ఓవర్‌బర్డెన్ తొలగింపు పనుల్లో డంపర్‌పై నుంచి కిందపడటంతో ఆపరేటర్ మూల్‌చంద్ ప్రాణాలు కోల్పోయాడు. మణుగూరు ఓసీ ప్రాంతంలో బంకర్ కూలిన ఘటనలో పవన్ కుమార్, రఘుపాల్ రెడ్డి అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలు కార్మిక భద్రత ఎంత కీలకమో స్పష్టంగా చెబుతున్నాయని కార్మికులు గుర్తు చేస్తున్నారు.

భద్రతపై మాటలు ఎక్కువ.. అమలు తక్కువ..?

సింగరేణి యాజమాన్యం తరచూ "సేఫ్టీ ఫస్ట్" అని ప్రచారం చేస్తూ భద్రతా వారోత్సవాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే ఆ కార్యక్రమాలు సమావేశాలకే పరిమితమవుతున్నాయని, గనుల్లో మాత్రం అవసరమైన భద్రతా పరికరాలు అందుబాటులో లేక కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేయాల్సి వస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. "ఉత్పత్తి తగ్గితే తిరిగి పెంచుకోవచ్చు... కానీ ప్రాణం పోతే తిరిగి తీసుకురాలేం. సింగరేణికి బొగ్గు తీసే కార్మికుడి ప్రాణానికి భద్రత కల్పించడం యాజమాన్యం తొలి బాధ్యత కాదా..?" అని కార్మికులు నిలదీస్తున్నారు.

కార్మిక సంఘాల డిమాండ్లు

కార్మికులకు పని స్వభావాన్ని బట్టి నాణ్యమైన పీపీఈ వెంటనే అందించాలి. పాడైన భద్రతా పరికరాలను తక్షణమే మార్చాలి. ప్రతి గనిలో పీపీఈ నిల్వలు అందుబాటులో ఉంచాలి. భద్రతా ప్రమాణాల అమలుపై స్వతంత్ర తనిఖీలు నిర్వహించి లోపాలను వెంటనే సరిదిద్దాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

నిపుణులు ఏమంటున్నారు..?

పరిశ్రమల భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రమాదాలను పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, నాణ్యమైన వ్యక్తిగత భద్రతా పరికరాల వినియోగం ద్వారా తీవ్ర గాయాలు, ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ప్రతి ఉద్యోగికి పని స్వభావానికి తగ్గ పీపీఈ అందించడం యాజమాన్య బాధ్యత అని వారు సూచిస్తున్నారు.

యాజమాన్యం స్పందించాల్సిన సమయం...

దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక బొగ్గు సంస్థగా పేరున్న సింగరేణి, ఉత్పత్తి లక్ష్యాలతో పాటు కార్మికుల ప్రాణ భద్రతకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని కార్మికులు కోరుతున్నారు. భద్రతా పరికరాల కొరతపై వచ్చిన ఫిర్యాదులను యాజమాన్యం అత్యవసరంగా పరిశీలించి, అన్ని ఏరియాల్లో అవసరమైన పీపీఈ అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story