- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెట్రో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు
మెట్రో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులో ఉండేలా తగు చర్యలు చేపట్టాలని హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి.అజిత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో స్టేషన్లు, వాటి సమీపంలోని వీధి స్థాయిలో ఉన్న సౌకర్యాలను మెట్రో అదనపు ఎండీ అజిత్ రెడ్డి సోమవారం పరిశీలించారు..

దిశ, తెలంగాణ బ్యూరో: మెట్రో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులో ఉండేలా తగు చర్యలు చేపట్టాలని హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి.అజిత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో స్టేషన్లు, వాటి సమీపంలోని వీధి స్థాయిలో ఉన్న సౌకర్యాలను మెట్రో అదనపు ఎండీ అజిత్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ మేరకు బేగంపేట్ స్టేషన్ నుండి రాయదుర్గ్ మెట్రో స్టేషన్ వరకు ఆయన మెట్రోలో ప్రయాణించారు. బేగంపేట్, అమీర్ పేట్, రాయదుర్గ్ మెట్రో స్టేషన్ల ప్లాట్ ఫామ్‌లు, కాంకోర్సులను సందర్శించారు. అక్కడ ప్రయాణీకులకు అందుతున్న సౌకర్యాల గురించి మెట్రో ఇంజినీర్లు, మెట్రో ఆపరేషన్లను నిర్వహించే కియోలిస్ సంస్థ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీధి స్థాయిలో ఉన్న పార్కింగ్ స్థలాల వినియోగాన్ని మరింత సమర్థవంతంగా చేపట్టాల్సిందిగా అదనపు ఎండీ సూచించారు. బేగంపేట్, అమీర్ పేట్, రాయదుర్గ్ స్టేషన్ల పరిథిలో పార్కింగ్ లను అయన సందర్శించి వాటిని ఇంకా మెరుగుపరచడానికి తగు సూచనలు చేశారు. అలాగే స్టేషన్ల దగ్గర పాటిస్తున్న స్వచ్ఛత, పరిశుభ్రతలపై కూడా ఆయన సమీక్షించారు. పిల్లర్ల మధ్య సెంట్రల్ మెరిడియన్ నిర్వహణ ఇంకా మెరుగు పడాలని ఆయన సూచించారు. వీటిని నిర్వహణ చూసే ఏజెన్సీల పనితీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేసారు. స్వచ్ఛత , పనుల నాణ్యత లోను రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు. రాయదుర్గ్ వద్ద స్కైవాక్, ఐటీ కంపెనీలకు మెట్రో నుండి మార్గాలు, మైండ్ స్పేస్ జంక్షన్ లో మెట్రో ప్రయాణీకుల రాకపోకలను అదనపు ఎండీ అజిత్ రెడ్డి పరిశీలించారు. రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో ఇంకా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మెట్రో స్టేషన్ల కింద ఉన్న వాణిజ్య సముదాయాలను ఆయన పరిశీలించారు. ప్రయాణీకులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణమే అధిక ప్రాధాన్యత కావాలని ఆయన అధికారులకు సూచించారు.
స్టేషన్ల వారీ ప్రణాళికలు…
స్టేషన్లను మరింత మెరుగుగా తీర్చిదిద్దేలా స్థానిక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రయాగాత్మకంగా మొదట పది మెట్రో స్టేషన్లను ఎంపిక చేసుకుని, అవి అన్ని విధాలా ఇంకా అభివృద్ధి జరిగేలా వెంటనే చర్యలు చేపట్టాలని మెట్రో అదనపు ఎండీ అన్నారు. తాను మిగిలిన మెట్రో స్టేషన్లను కూడా దశల వారీ పర్యటించి,ప్రయాణీకులకు అందే సౌకర్యాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని అజిత్ రెడ్డి తెలిపారు. పార్కింగ్ లు, పారిశుధ్య స్థితిగతులు, భద్రత ఏర్పాట్లను అయన అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన లో హెచ్ఎంఆర్ చీఫ్ ఇంజినీర్ వై.సాయప రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.శ్యామ్ మోహన్, జనరల్ మేనేజర్ (సెక్యూరిటీ) శ్రీనాథ్ రెడ్డి, డిఎస్పిలు జగన్నాథ్ రెడ్డి, శివరామి రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.






