- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.600 కోట్ల ప్రభుత్వ భూమిపై కన్నేసిన కబ్జాదారులు! రంగంలోకి దిగాలని హైడ్రాకు ప్రజల విజ్ఞప్తి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి-మూసాపేట మధ్య ఉన్న సుమారు రూ.600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని మూసాపేట నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి-మూసాపేట మధ్య ఉన్న సుమారు రూ.600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని మూసాపేట నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 42 ఫిర్యాదులు అందగా, ఈ అంశం ప్రధానంగా నిలిచింది. ఫిర్యాదు ప్రకారం, కూకట్‌పల్లి-మూసాపేట మధ్య మొత్తం 10.18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 4 ఎకరాలను మంచి నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణం కోసం జలమండలికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మిగిలిన 6.18 ఎకరాల్లో 2 ఎకరాలను మండల ఎంపీపీఎస్ బాలుర పాఠశాల, జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాల భవనాల నిర్మాణానికి కేటాయించారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయగా, 2023లో సరిహద్దులు నిర్ణయించి మండల విద్యాశాఖ అధికారులకు భూమిని అప్పగించారు. అయితే ఇప్పటి వరకు పాఠశాల భవనాల నిర్మాణం చేపట్టకపోవడంతో, ఆ రెండు ఎకరాలతో పాటు మిగిలిన 4.18 ఎకరాల ప్రభుత్వ భూమిపై పలువురు నిర్మాణ సంస్థలు షెడ్లు వేసి ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు స్థానికులు ఆరోపించారు. ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పరిరక్షించాలని హైడ్రాను కోరారు.
దుండిగల్‌లో కాలుష్యంపై మరో ఫిర్యాదు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ గ్రామంలోని సర్వే నంబర్ 419లో నిర్వహిస్తున్న రెడీ మిక్స్ కాంక్రీట్ కేంద్రం వల్ల తీవ్ర వాయు, శబ్ద కాలుష్యం ఏర్పడుతోందని మరో ఫిర్యాదు అందింది. సమీపంలో పాఠశాలలు, నివాస ప్రాంతాలు ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులతో చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజావాణిలో మొత్తం 42 ఫిర్యాదులు
సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణిలో మొత్తం 42 ఫిర్యాదులు అందాయి. వాటిని హైడ్రా అదనపు కమిషనర్ డి. ఆనంద్ కుమార్ పరిశీలించి, పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపించారు.
క్యూర్ పరిధిలో 120 ఫిర్యాదులు
క్యూర్ పరిధిలోని జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో మొత్తం 120 ఫిర్యాదులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 53, సీఎంసీ పరిధిలో 45, ఎంఎంసీ పరిధిలో 22 ఫిర్యాదులు వచ్చాయి. సీఎంసీ పరిధిలో టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన ఫిర్యాదులే అత్యధికంగా 25 నమోదయ్యాయి.






