దోపిడీలో సహకారం! మొక్కజొన్న కొనుగోళ్లలో అక్రమాలు

by Ajay Maddhiboyina |

మొక్కజొన్న కొనుగోళ్లలో మద్దతు ధర కల్పించాల్సిన సహకార సంఘమే దళారులతో కుమ్మకై తక్కువ ధరలకు కొనుగోలు చేసి, వాటినే ప్రభుత్వ ధరకు విక్రయించి భారీగా దండుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

దోపిడీలో సహకారం! మొక్కజొన్న కొనుగోళ్లలో అక్రమాలు
X

మొక్కజొన్న కొనుగోళ్లలో మద్దతు ధర కల్పించాల్సిన సహకార సంఘమే దళారులతో కుమ్మకై తక్కువ ధరలకు కొనుగోలు చేసి, వాటినే ప్రభుత్వ ధరకు విక్రయించి భారీగా దండుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రైతుకు ఉచితంగా అందించే ఆన్‌లైన్ నమోదు కోసం వెయ్యి రూపాయల వరకు వసూలు చేశారని, ఒక్కో రైతు నుంచి వందల రూపాయలు కోత విధించడంతో వేలాది బస్తాలపై భారీ మొత్తంలో వసూళ్లు జరిగినట్లు సమాచారం. మార్కెట్‌లో మంచి ధర ఉన్నప్పటికీ క్వింటాల్‌కు రూ.500 నుంచి రూ.600 వరకు తక్కువ ధరకు కొన్నారని ఆరోపణలు వస్తున్నాయి. విక్రయించిన తర్వాత పలు సాకులతో ఒక్కో రైతు నుంచి రూ.10 నుంచి 20కిలోల వరకు తగ్గించి చెల్లించినట్లు రైతులు చెబుతున్నారు. అక్రమంగా వచ్చిన సొమ్ము పంపకాల్లో అంతర్గత విభేదాలు తలెత్తాయని, అధికారులు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. రైతుల సంక్షేమం కోసం ఏర్పాటైన సహకార వ్యవస్థే తమను దోచుకుందని రైతులు ఆందోళనకు సిద్ధమతున్నారు. దిశ, ఇల్లెందు

దిశ ఇల్లెందు: రైతులకు అండగా నిలవాల్సిన సహకార సంఘమే కొందరి చేతుల్లో ఆదాయ వనరుగా మారిందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మొక్కజొన్న కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయని, రైతులను అనేక రకాలుగా దోచుకుంటూ లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులకు పూర్తి మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, దళారులతో కుమ్మకై తక్కువ ధరలకు మొక్కజొన్నను కొనుగోలు చేసి, ప్రభుత్వ ధరకు విక్రయించడం ద్వారా భారీ లాభాలు ఆర్జించారని రైతులు మండిపడుతున్నారు.

ఆన్‌లైన్ పేరిట వసూళ్లు

ప్రభుత్వం రైతుల కోసం పూర్తిగా ఉచితంగా అందించే ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను సైతం ఆదాయ మార్గంగా మార్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో రైతు నుంచి వెయ్యి రూపాయల వరకు వసూలు చేసినట్లు బాధిత రైతులు చెబుతున్నారు. ఆన్‌లైన్ సేవకు ఎలాంటి రుసుము లేకపోయినా, "ఇలా చేయకపోతే కొనుగోలు జరగదు" అంటూ రైతులను భయపెట్టి డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. బస్తాలకు సైతం డబ్బులు కటింగ్ చేసి ఇక్కడితో ఆగకుండా ప్రతి బస్తాపై వివిధ పేర్లతో పైసలు కట్ చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రైతు నుంచి వందల రూపాయలు కోత విధించడం ద్వారా వేలాది బస్తాలపై భారీ మొత్తంలో అక్రమ వసూళ్లు జరిగినట్లు సమాచారం. ఈ కోతలకు ఎలాంటి అధికారిక రసీదులు ఇవ్వలేదని రైతులు చెబుతున్నారు.

రైతుల నుంచి తక్కువ ధరకు

మార్కెట్‌లో మంచి ధర ఉన్నప్పటికీ, రైతుల నుంచి క్వింటాలుకు రూ.500 నుంచి రూ.600 వరకు తక్కువ ధరకు మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దళారులతో కుమ్మకై రైతుల నిర్భంద పరిస్థితిని ఆసరాగా చేసుకుని తక్కువ ధరకు సరుకును తీసుకుని, అనంతరం ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించి భారీగా లాభాలు గడించారని రైతులు ఆరోపిస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన మొక్కజొన్నను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా పూర్తి ధరకు విక్రయించడంతో లక్షలాది రూపాయల అక్రమ లాభాలు వచ్చినట్లు సమాచారం. రైతుల చెమటను కొందరు తమ ఆదాయంగా మార్చుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విక్రయించిన పైసల్లో సైతం కోత

మొక్కజొన్న విక్రయించిన తర్వాత కూడా రైతులకు పూర్తిస్థాయి చెల్లింపులు జరగలేదని ఆరోపణలు ఉన్నాయి. ‘తేమ ఎక్కువగా ఉంది, గింజలు పాడయ్యాయి, నాణ్యత తక్కువగా ఉంది’ వంటి కారణాలు చూపుతూ ఒక్కో రైతు నుంచి 10 నుంచి 20 కిలోల వరకు తగ్గించి చెల్లింపులు చేసినట్లు రైతులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతులు మరింత ఆర్థికంగా దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంపకాల్లో విధేదాలు?

ఈ మొత్తం వ్యవహారంలో అక్రమంగా వచ్చిన సొమ్ము పంపకాల విషయంలో అంతర్గత విభేదాలు నెలకొన్నాయని, కొందరు అధికారులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ పరిణామం వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారడానికి కారణమైందని స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు.

రైతన్నల అసహనం

ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన ధర రాకపోవడం, కొనుగోలు ప్రక్రియలో అనేక రకాల కోతలు విధించడం, ఆన్‌లైన్ పేరిట డబ్బులు వసూలు చేయడం వంటి ఘటనలతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం ఏర్పాటైన సహకార వ్యవస్థే తమను దోచుకుందని పలువురు రైతులు వాపోతున్నారు. తమకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదులు ఇవ్వడంతో పాటు, అవసరమైతే పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం.

===================================

మొక్కజొన్న కొనుగోళ్లపై విచారణ చేపడతాం

ఎన్. వెంకట ఆదిత్య, సీఈఓ, డీసీసీబీ ఖమ్మం

మొక్కజొన్న కొనుగోళ్ల లో జరిగిన అవకతవకలపై శాఖాపరమైన విచారణ చేపడతాం. అవినీతికి పాల్పడ్డట్టు విచారణలో తేలితే చర్యలు తీసుకుంటాం. రైతులను ఇబ్బంది పెట్టే ఏ చర్యలైన సహించేది లేదు.

Next Story