కార్పోరేషన్ పదవుల పందెరంలో... బీసీ, ఎస్సీలకు మొండిచేయి

by Ratna Kumari |

తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుత సీఎం, ఆ పార్టీ అగ్ర నాయకులు హామీ ఇచ్చారు.

కార్పోరేషన్ పదవుల పందెరంలో... బీసీ, ఎస్సీలకు మొండిచేయి
X

దిశ, కొత్తగూడెం ప్రతినిధి : తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుత సీఎం, ఆ పార్టీ అగ్ర నాయకులు హామీ ఇచ్చారు. ఇది నమ్మిన బీసీలు తమకు మంచిరోజులు రాబోతున్నాయనే ఆశతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల బుట్టలో పడి ఆ పార్టీకి మద్దతు తెలిపారు. అధికారంలోకి వచ్చాక 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని.. అందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలుపుతూ రిజర్వేషన్ల సాధ్యసాధ్యాలను ప్రభుత్వం పట్టించుకోకుండా హామీని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు అది రాజ్యాంగ విరుద్దమని కొంతమంది నాయకులు కోర్టు మెట్లెక్కితే, అది సాధ్యపడదని న్యాయనిపుణులు, న్యాయ కోవిదులు తేల్చి చెప్పేశారు. ఒక రకంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదని ఇన్ డైరెక్టుగా తేల్చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఈ రకంగా ఆచరణకు నోచుకోకపోవడం, ఆ హామీ ఆటకెక్కడం జరిగిపోయింది. అయితే బీసీల్లో పెల్లుబికిన ఆగ్రహాన్ని పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తామని అవసరమైతే పార్టీపరంగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్పోరేషన్లకు, మున్సిపాలిటీలకు ఎన్నికల సంఘం ఎన్నికలు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీతో పాటు అన్నీ పార్టీలు పోటీ చేసే నాయకులకు టిక్కెట్లను పంపిణీ జరిగిపోయింది. ఎన్నికలు జరిగిపోయాయి. ఫలితాలు వచ్చాయి, కానీ ఎక్కడా బీసీలకు న్యాయం జరగలేదన్నది బీసీ సంఘాల నాయకుల వాదన. ఇక కొత్తగూడెం కార్పోరేషన్ మేయర్ పదవి ఎస్టీ జనరల్ కావడంతో ఎన్నికల ఫలితాల అనంతరం కనీసం డిప్యూటీ చైర్మన్ అయినా బీసీలకు దక్కుతుందేమోనని తమ బీసీలకైనా గౌరవం దక్కుతుందేమోనని ఎదురుచూసిన బీసీ నాయకులకు నిరాశ ఎదురైంది. బీసీ నాయకులే కాదు ఎస్సీ సామాజిక వర్గాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ విస్మరించిందనే విమర్శలు ఆయా సామాజిక వర్గాల నాయకుల నుంచి వినిపిస్తుంది.

బీసీ, ఎస్సీలలో పెల్లుబికుతున్న ఆగ్రహం

కొత్తగూడెం కార్పోరేషన్ మేయర్ ఎస్టీకి రిజర్వ్ కావడంతో మిగిలిన బీసీ, ఎస్సీ కార్పోరేటర్లు తమలో ఎవరికైనా డిప్యూటీ చైర్మన్ దక్కుతుందేమోనని ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో పార్టీ నాయకుల్లో కొంత గందరగోళం నెలకొనడం, ఆ తర్వాత కాంగ్రెస్, సీపీఐల ఆగ్రనాయకత్వం కలిసిపోయి మేయర్, డిప్యూటీ మేయర్ రొటేషన్ పద్దతిలో తొలి రెండున్నరేళ్ళు సీపీఐ, మిగిలిన రెండున్నరేళ్ళు కాంగ్రెస్ పార్టీ పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. అయితే మేయర్ పీఠం ఎలాగో ఎస్టీకి రిజర్వ్ అయింది కనుక ఇక మిగిలిన డిప్యూటీ చైర్మన్ పదవి కోసం కార్పోరేటర్లుగా గెలిచిన బీసీలు, ఎస్సీలలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తూ ఆశావాద దృక్పథంతో ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పోరేటర్లుగా గెలిచిన వారిలో 22 మందిలో ముగ్గురు ఓసీలు, ఐదుగురు ఎస్టీలు, 12మంది బీసీ, ఎస్సీలు ఉన్నారు. వీరిలో నూకల సరిత, ఆకునూరి సుప్రియ, కనుకుంట్ల శ్రీనివాస్, దుంపల రాజేశ్వరరావు, జెల్లి శ్రీలక్ష్మి, కాల్వ భాస్కరరావు, దంతెరబోయిన నరేష్, కొత్వాల రమాదేవి, రాజనళిని జయంతి, సింగార హరిహరణ్, మహ్మద్ దావూద్, రావి రాంబాబులు ఉన్నారు.

సీనియర్లలో అసహనం

కార్పోరేషన్ లో ఎన్నికలలో గెలిచిన కార్పోరేటర్లలో డిప్యూటీ మేయర్ కోసం పార్టీ సీనియర్ నాయకులు బీసీ వర్గానికి చెందిన నూకల రంగారావు సతీమణి నూకల సరిత, కొత్వాల శ్రీనివాసరావు భార్య విమలాదేవి, మాజీ వైస్ చైర్మన్ సీనియర్ కౌన్సిలర్ రావిరాంబాబులు, ఎస్సీ వర్గానికి చెందిన సీనియర్ మున్సిపల్ సీనియర్ కౌన్సిలర్లు రాజనళిని జయంతి, కాల్వ భాస్కరరావులతో పాటు కనుకుంట్ల శ్రీనివాస్, ఆకునూరి సుప్రియ, జెల్లి శ్రీలక్ష్మీ, మహ్మద్ దావూద్లు ఉన్నారు. అయితే ఇందులో నూకల రంగారావు సీనియర్ కాంగ్రెస్ నాయకుడితో పాటు బీసీ వర్గాల్లో కొంత పట్టున్న నాయకుడు, అందరినీ కలుపుకొనిపోయేతత్వంతో పాటు, పార్టీని దశాబ్దన్నర కాలంగా అంటిపెట్టుకొని ఉంటూ కష్టనష్టాలను భరిస్తూ పాల్వంచ పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. డిప్యూటీ మేయర్ పదవిని ఈయన సతీమణి నూకల సరితకు ఇవ్వడం సముచితమనే భావన కూడా కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా బీసీ, ఎస్సీ వర్గాలలో కూడా బలంగా వినిపించింది. ఇక మరో సీనియర్ నాయకుడు కొత్వాల శ్రీనివాసరావు కూడా బీసీ నాయకుడు ఈయన సతీమణి కొత్వాల విమలాదేవి కూడా అర్హురాలేనని ప్రచారం జరిగింది. ఇదే సామాజిక వర్గానికి చెందిన రావి రాంబాబు గత రెండు దశాబ్దాలుగా సీనియర్ కౌన్సిలర్ గా కొనసాగడమే కాకుండా వైస్ చైర్మన్ గా చేసిన అనుభవం సైతం ఇతనికి ఉంది. ఇక కనుకుంట్ల శ్రీనివాస్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, యువతలో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉన్న నాయకుడు, మరో యువ కార్పోరేటర్ ఆకునూరి సుప్రియ తండ్రి ఆకునూరి కనకరాజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుంగు అనుచరుడిగా ఉంటున్నారు. మాజీ కౌన్సిలర్, ముస్లీం మైనారిటీ నాయకుడు మసూద్ సతీమణి సీనియర్ కౌన్సిలర్ రాజనళిని జయంతి, పాల్వంచ మండలంలో ఎస్సీ సామాజికవర్గంలో పట్టున్న నాయకుడు, సీనియర్ కౌన్సిలర్ కాల్వ భాస్కర రావు తో పాటు , పార్టీ సీనియర్ నాయకురాలు జెల్లి శ్రీలక్ష్మీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేధింపులు తట్టుకొని నిలబడి ప్రజాసేవ చేస్తున్నారు.

గత అధికార పార్టీ నాయకులు ఎవరు ఎంత ఒత్తిడి తీసుకువచ్చిన పార్టీ జెండాను విడవకుండా తన భర్తతో కలిసి డివిజన్లో సేవా కార్యక్రమాలను కొనసాగించారు. వీరందరూ డిప్యూటీ మేయర్ పదవికి అర్హులేనని వీరిలో దాదాపు అందరూ తమతమ స్థాయిలో పదవి కోసం ప్రయత్నాలు చేయగా ఎస్సీ, బీసీలలో ఎవరికో ఒకరికి డిప్యూటీ పదవి దక్కుతుందని ఆశించారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వీరందరిని విస్మరించి ఓసీ సామాజిక వర్గాల లాబీయింగ్ కు తలొగ్గి ఎస్సీ, బీసీ వర్గాల కార్పోరేటర్లకు తీవ్ర అన్యాయం చేసిందనే భావన వీరిలో నెలకొంది. ఓసీ సామాజికవర్గానికి తాము వ్యతిరేకం కాదని, కానీ తమలో ఎవరికి డిప్యూటీ మేయర్ అవకాశం వచ్చిన న్యాయం జరిగిందనుకునేవాళ్ళమని ఆ రకంగానైనా సంతోషపడేవాళ్లమనుకుంటున్నారు. డిప్యూటీ మేయర్ కోసం ఇంకా మరో రెండేళ్లు ఆగాల్సిందేనా ..? అని కార్పోరేటర్లలో నిరాశ, నిసృహలు ఆవరించాయి. అప్పుడైన తమకు న్యాయం జరుగుతుందా...? లేక మరోసారి మొండిచేయి చూపిస్తారా ...? అని లోలోన కార్పోరేటర్లు మదనపడుతున్నారు. కానీ ప్రస్తుతం కొత్తగూడెం కార్పోరేషన్లో మాత్రం ఎస్సీ, బీసీ వర్గాల కార్పోరేటర్లను పూర్తిగా విస్మరించి పూర్తిగా అన్యాయం చేసి గౌరవం లేకుండా చేశారనే విమర్శలు ఆయా సామాజికవర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఆయా సామాజికవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెబుతుందో చూడాలి మరి

Next Story