'లంచం ఇస్తాం పని చేయండి' అని రైతు నోట అనిపించేలా అధికారుల వేధింపులు

by Kodari Anjali |

ప్రభుత్వ కార్యాలయమా లేక కమీషన్ల అడ్డానా అన్నట్లు తయారైంది దమ్మపేట తహసీల్దార్ ఆఫీసు తీరు.

లంచం ఇస్తాం పని చేయండి అని రైతు నోట అనిపించేలా అధికారుల వేధింపులు
X

దిశ, దమ్మపేట: ప్రభుత్వ కార్యాలయమా లేక కమీషన్ల అడ్డానా అన్నట్లు తయారైంది దమ్మపేట తహసీల్దార్ ఆఫీసు తీరు. 'పైసా లేనిదే పని జరగదు' అన్నది ఇక్కడ అప్రకటిత నిబంధనగా మారిపోయింది. ముడుపులు ముడితే చాలు అక్రమార్కులకు రాత్రికి రాత్రే ఫైళ్లు పాస్ అవుతాయి. ఏజెన్సీ చట్టాలను సైతం తుంగలో తొక్కి దమ్మపేట రెవెన్యూ యంత్రాంగం సాగిస్తున్న కాసుల కక్కుర్తికి.. బతికున్న మళ్ళా సత్యం అనే వృద్ధుడి పేరుతో సృష్టించిన నకిలీ మరణ శాసనమే నిలువెత్తు సాక్ష్యం.

ఆఫీసులోనే ఆన్‌లైన్.. ఆ ఫిల్టర్ వ్యవస్థ ఏమైనట్లు?

బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికెట్, వేరొక మహిళతో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సృష్టించి ఐదెకరాల ఏజెన్సీ భూమిని కాజేసిన ఈ ఉదంతంలో అధికారుల డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నకిలీ 'సక్సెషన్' ఫైల్‌ను దమ్మపేట తహసీల్దార్ కార్యాలయం నుంచే గుట్టుచప్పుడు కాకుండా ఆన్‌లైన్ చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సాధారణంగా ఒక ఫైల్ ఆన్‌లైన్‌లో రాగానే.. ముందుగా జీపీవో ఆ తర్వాత ఆర్ఐ, ఆపై భూభారతి (ధరణి) ఆపరేటర్ వద్ద పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా ఫిల్టర్ జరిగిన తర్వాతే తహసీల్దార్ అమోదానికి చేరుకుంటుంది. ఇంత పక్కాగా మూడంచెల వ్యవస్థ ఉన్నప్పుడు, కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు ఎవరూ ఈ ఫేక్ ఫైల్‌ను ఎందుకు పట్టుకోలేకపోయారు? కనీస క్షేత్రస్థాయి విచారణ చేయకుండానే నకిలీ పత్రాలకు డిజిటల్ ఆమోదం ఎలా తెలిపారు? ముడుపులు ముట్టగానే నిబంధనలను గాలికొదిలేశారా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సామాన్యుడికి చుక్కలు.. మాఫియాకు రెడ్ కార్పెట్!

ఇదే ఆఫీసుకు ఒక సామాన్య, రైతు వస్తే చాలు.. అధికారులు చుక్కలు చూపిస్తారు. 'ఆ కాగితం లేదు.. ఈ కాగితం లేదు' అంటూ వంకలు పెట్టి, చెప్పులరిగేలా ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి టేబుల్ దగ్గరా రైతులను ముప్పుతిప్పలు పెడుతూ.. విసిగిపోయిన సదరు రైతు తన నోటితో తానే "అయ్యా.. ఎంతైనా లంచం ఇస్తాను, దయచేసి నా పని ముందు పడేయండి" అని బతిమిలాడుకునే స్థాయికి తీసుకొచ్చి మరీ సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు మండిపడుతున్నారు. సామాన్య రైతులకు వంద అడ్డంకులు సృష్టించే ఈ అధికారులు.. ఏమాత్రం ఆధారాలు లేని ఈ నకిలీ మళ్ళా సత్యం ఫైల్‌ను మాత్రం ఎవరికి వారు ఎలా ముందుకు లాగించారు? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న.

'ధరణి' ప్రారంభం నుంచి జరిగిన బదలాయింపులపై విచారణ జరగాలి

కేవలం మళ్ళా సత్యం ఫైల్ మాత్రమే కాదు.. దమ్మపేట ఏజెన్సీలో వెలుగుచూడాల్సిన నకిలీ దస్త్రాలు ఇంకా ఎన్నో ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం జనవరి 2026 ప్రస్తుత తహసీల్దార్ వచ్చిన దగ్గర నుంచే కాకుండా, అసలు ధరణి (భూభారతి) పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు దమ్మపేట మండలంలో జరిగిన ప్రతి 'భూ బదలాయింపు' (ముఖ్యంగా పార్టిషన్, సక్సెషన్) పైనా సమగ్ర విచారణ జరగాల్సిందేనని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మండలంలోని మొత్తం 22 రెవెన్యూ గ్రామాల పరిధిలో జరిగిన ఫైళ్లన్నింటినీ జిల్లా విజిలెన్స్ అధికారులు తక్షణమే సీజ్ చేసి 'స్పెషల్ ఆడిట్' చేయాలి. అప్పుడే ఈ అక్రమాల పుట్టలో దాగిన వందల నకిలీ భూ బదలాయింపులు వెలుగులోకి వస్తాయి.

త్వరలో ఆర్డీవో విచారణ..

ఈ వివాదాస్పద వ్యవహారంపై పత్రికల్లో వరుస కథనాలు రావడంతో జిల్లా యంత్రాంగం కదిలింది. బతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఏజెన్సీ భూమిని కాజేసిన ఉదంతంపై త్వరలోనే ఆర్డీవో స్వయంగా విచారణ చేపట్టనున్నారని దమ్మపేట తహసీల్దార్ 'దిశ' కు వివరణ ఇచ్చారు. అయితే ఈ విచారణ కేవలం అధికారుల తప్పులను కప్పిపుచ్చుకునేలా కాకుండా.. పారదర్శకంగా జరిగి, బాధ్యులైన కబ్జాకోరులు, వారికి సహకరించిన అధికారులపై చర్యలు చేయాలని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

Next Story