FDIs: విదేశీ పెట్టుబడుల్లో భారత్ జోరు

by S Gopi |

2024లో 13వ స్థానంలో ఉన్న భారత్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ప్రపంచంలో 11వ అతిపెద్ద ఎఫ్‌డీఐ గమ్యస్థానంగా నిలిచింది.

FDIs: విదేశీ పెట్టుబడుల్లో భారత్ జోరు
X

దిశ, బిజినెస్ బ్యూరో: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడంలో భారత్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి సంస్థ (యూఎన్‌సీటీఏడీ) విడుదల చేసిన వరల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ రిపోర్ట్–2026 ప్రకారం, 2025లో భారత్‌లోకి వచ్చిన ఎఫ్‌డీఐలు 44 శాతం పెరిగి 38.89 బిలియన్ డాలర్ల(రూ. 3.70 లక్షల కోట్ల)కు చేరింది. దీంతో 2024లో 13వ స్థానంలో ఉన్న భారత్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ప్రపంచంలో 11వ అతిపెద్ద ఎఫ్‌డీఐ గమ్యస్థానంగా నిలిచింది. సేవల రంగంతో పాటు అధునాతన తయారీ, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం ఈ వృద్ధికి ప్రధాన కారణమని యూఎన్‌సీటీఏడీ పేర్కొంది.

ప్రపంచంలోనే అతిపెద్ద 'ఆల్ఫాబెట్' ప్రాజెక్టు

ప్రపంచ పెట్టుబడుల వాతావరణం నెమ్మదించినప్పటికీ భారత్ పెట్టుబడులను ఆకర్షించడంలో నిలకడగా ముందుకు సాగింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎఫ్‌డీఐల సగటు పెరుగుదల కేవలం 2 శాతం, ఆసియాలో 3 శాతం మాత్రమే ఉండగా భారత్ మాత్రం 44 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. అయితే మరోవైపు ప్రకటించిన గ్రీన్‌ఫీల్డ్ పెట్టుబడుల విలువ 111.14 బిలియన్ డాలర్ల(రూ. 10.59 లక్షల కోట్ల) నుంచి 74.12 బిలియన్ డాలర్ల(రూ. 7.06 లక్షల కోట్ల)కు తగ్గింది. అయినప్పటికీ, అమెరికాకు చెందిన ఆల్ఫాబెట్ భారత్‌లో డేటా సెంటర్ కోసం 14.5 బిలియన్ డాలర్ల(రూ. 1.38 లక్షల కోట్ల) పెట్టుబడిని ప్రకటించడం 2025లో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుగా నిలిచింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో హైన్‌ఫ్రా ప్రకటించిన 4 బిలియన్ డాలర్ల(రూ. 38 వేల కోట్ల) పెట్టుబడి కూడా ప్రధాన పెట్టుబడి ఒప్పందాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

18వ స్థానానికి ఎగబాకిన భారత్

విదేశాల్లో భారత కంపెనీల పెట్టుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. 2025లో భారత్ నుంచి బయటకు వెళ్లిన ఎఫ్‌డీఐలు 47 శాతం పెరిగి 35.66 బిలియన్ డాలర్ల(రూ. 3.39 లక్షల కోట్ల)కు చేరడంతో, విదేశీ పెట్టుబడులు పెట్టే దేశాల జాబితాలో భారత్ 18వ స్థానానికి ఎగబాకింది. అలాగే భారతీయ కంపెనీలు ప్రకటించిన విదేశీ గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల విలువ 41 శాతం పెరిగి 25.29 బిలియన్ డాలర్ల(రూ. 2.41 లక్షల కోట్ల)కు చేరింది. ప్రపంచ వాణిజ్య అనిశ్చితులు, సరఫరా మార్పులు వంటి సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ, అధునాతన తయారీ, మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఎకానమీపై ప్రభుత్వ విధానాలు భారత్‌ను ప్రపంచ పెట్టుబడిదారులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా నిలబెడుతున్నాయని యూఎన్‌సీటీఏడీ నివేదిక స్పష్టం చేసింది.

Next Story