తెలంగాణ రైతుల‌కు శుభ‌వార్త‌..భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

by velandi.Saikiran |   (  Updated:2026-03-28 22:00:11  IST  )

భూ వివాదాలకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటోంది.

తెలంగాణ రైతుల‌కు శుభ‌వార్త‌..భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం
X

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

=ఏప్రిల్2 నుంచి ఎంపిక చేసిన మండలాల్లో భూ భారతి

=ఖమ్మం నుంచి కూసుమంచి, భద్రాద్రి నుంచి అశ్వారావుపేట

=పైలట్ మండలాలుగా ఎంపిక.. అమలుకు శ్రీకారం

భూ వివాదాలకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే వచ్చే నెల రెండు నుంచి ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్‌ను ఎంపిక చేసిన మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలుకు శ్రీకారం చుట్టనుంది. ఖమ్మం జిల్లాలో కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట మండలాలను పైలట్ గా గుర్తించి అమలు చేసేందుకు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసింది. భూ భారతి అమలులో మెరిట్స్, డీ మెరిట్స్ ను గుర్తించి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోనున్నారు. అంతేకాదు రిజిస్ట్రేషన్ సమయంలో భూమిని సర్వే చేసి సర్వే మ్యాపును కూడా జతచేయడమే కాకుండా.. భూ ధార్ నెంబర్లను కూడా కేటాయించనున్నారు. రెవెన్యూ, సర్వే ల్యాండ్ రిక్డార్డ్స్, రిజిస్ట్రేషన్ శాఖల సమన్వయంతో ఈ విధానానికి పూర్తి హంగులు తీసుకురానున్నారు. దిశ, ఖమ్మం రూరల్/ అశ్వారావుపేట

దిశ, ఖమ్మం రూరల్ : రాష్ట్రంలో భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించిన ప్రకారం ‘ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్’ను ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం, భద్రాద్రి కొత్తగూడెం నుంచి అశ్వారావుపేట మండలం ఎంపికైంది. మొత్తం రాష్ట్రంలో ఐదు మండలాల్లో ఈ పథకం వ‌చ్చే నెల2వ తేదీ నుంచి ఈ పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభానికి శ్రీకారం చుట్టింది. మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలాన్ని పైలెట్ మండలంగా ఎంపిక చేశారు. కూసుమంచి మండలంలో మొత్తం 18 రెవెన్యూ గ్రామాలు ఉండగా వచ్చె నెల2 నుంచి జరిగే క్రయవిక్రయ దారులకు సర్వే మ్యాప్ చేసి, మ్యాప్‌ను అప్లోడ్ చేసి రిజిస్టర్ చేస్తారు. దీంతో భవిష్యత్‌లో కొనుగోలుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డబుల్ రిజిస్ట్రేషన్లు, ఇతరత్రా సమస్యలు తలెత్తకుండా ఉండేలా ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుంది.

ప్రతి వ్యవసాయ భూమికి భూధార్ నంబర్ కేటాయింపు..

మండలంలోని ప్రతి వ్యవసాయ భూమికి ఓ భూ ధార్ నెంబర్‌ను కేటాయిస్తారు. దీంతో మిస్ మ్యాచింగ్ వంటి సమస్యలకు చెక్ పడనుంది. రికార్డుల ప్రకారం ఒక నెంబర్, పాస్ పుస్తకంలో మరొక నెంబర్ ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా సర్వే మ్యాప్ జతపరచేలా ప్రణాళికలు చేస్తున్నారు. పాత రికార్డుల సరిచూడటం, పొలాల సరిహద్దుల నిర్ధారణ, నక్షా (మ్యాప్) లేని గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తారు. గ్రామస్థాయిలో సర్వే పూర్తయిన తర్వాత భూమి వివరాలు, యజమాని వివరాలు, సరిహద్దులు అన్నీ డిజిటల్ రూపంలో భూ భారతి పోర్టల్‌లో నమోదు చేస్తారు. రిజిస్ట్రేషన్, రెవెన్యూ, సర్వే శాఖల మధ్య రియల్‌టైమ్ డేటా షేరింగ్ చేస్తారు.సర్వే & ల్యాండ్ రికార్డ్స్ శాఖ అధికారులు ఆధునిక పద్ధతులు (డిజిటల్ సర్వే, GPS, డ్రోన్ సర్వే) వినియోగం కచ్చితమైన భూసరిహద్దులు గుర్తిస్తారు. ఈ పథకంలో మూడు ప్రధాన శాఖలు ఒకే వేదికపైకి వస్తాయి, రెవెన్యూ శాఖ సర్వే & ల్యాండ్ రికార్డ్స్, రిజిస్ట్రేషన్ శాఖ దీంతో భూమి కొనుగోలు–అమ్మకాల్లో మోసాలు, వివాదాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రికార్డుల పరిశీలన, భూముల గుర్తింపు, రీసర్వే పనుల ప్రారంభం చేపడుతారు. త్వరలోనే ప్రతి సర్వే నంబర్‌కు భూధార్ నంబర్ కేటాయింపు జరుగనుంది. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తూ, ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పైలెట్ ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని అధికారులు వెల్లడించారు.“భూ భారతి” పోర్టల్ ద్వారా భూములకు ప్రత్యేక గుర్తింపు, డిజిటల్ మ్యాపింగ్, శాఖల అనుసంధానం కలగడంతో భూవివాదాలు తగ్గి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభం కానుంది. కుసుమంచి మండలం ఈ మార్పుకు కేంద్రంగా నిలవనుంది. ఈ పథకం ఇక్కడ విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తొంది.

కసరత్తు చేస్తున్నాం

డీ. సైదులు, కూసుమంచి తహసీల్దార్

ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ కింద కూసుమంచి మండలం ఎంపికైంది. వచ్చే నెల2న ఈ పథకాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదగా ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. మండలంలోని అన్ని గ్రామాల జీపీఓలు, సర్వేయర్లకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సూచనలు ఇస్తున్నాం. పథకాన్ని సక్సెస్ చేసేందుకు కృషి చేస్తాం.

భూ సమస్యలకు పరిష్కారం..

ఏజెన్సీ ప్రాంతమైన అశ్వారావుపేట మండలంలోని అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో రిజిస్ట్రేషన్ రిజిస్టర్ భూములు ఉన్నాయి. అల్లిగూడెం, నారంవారిగూడెం గ్రాపంచాయతీల మైదాన ప్రాంతంలోని కొన్ని వ్యవసాయ పట్టా భూములు మినహా, మిగిలినదంతా 1/70 యాక్ట్ కు చెందిన అసైన్డ్ భూములు ఉన్నాయి. ఇక్కడ అనేకమైన వారసత్వ సరిహద్దు భూ సమస్యలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ ప్రక్షాళనలో భాగంగా జరిగిన భూ సర్వే కొంతవరకే జరిగింది. దీంతో చాలా వ్యవసాయ భూములు సర్వేకి నోచుకోక పలు ప్రభుత్వ పథకాల లబ్ధికి దూరంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర కొత్త పాసు బుక్కులు లేని రైతులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది.

పైలెట్ ప్రాజెక్టుతో ముందుగానే సర్వే

ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ సర్వేలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన అశ్వారావుపేట మండలంలో వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో మెరిట్ - డి మెరిట్లను క్షుణ్నంగా పరిశీలించనున్నారు. వీటి ఆధారంగా భూ భారతి పోర్టల్‌లో మార్పులు చేర్పులు చేపట్టనున్నారు. భూభారతి చట్టం ప్రకారం వ్యవసాయ భూములకు సంబంధించిన క్రయ విక్రయదారులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ జతపరిచే నిబంధనను అమలు చేయనున్నారు. ఇందుకోసం ఇటీవల నియామకం చేపట్టిన లైసెన్సుడ్ సర్వేయర్లను ఉపయోగించుకోనున్నారు. అసైన్డ్ భూములు అధికంగా కలిగిన అశ్వారావుపేట మండలంలో వారానికి 15భూభారతి పోర్టల్ ట్రాన్సాక్షన్లు జరిగేందుకు అవకాశం ఉంది. పైలెట్ ప్రాజెక్టు మండలాల్లో జరగనున్న భూ క్రయవిక్రయాల ట్రాన్సక్షన్లతో భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న భూ రీ సర్వే లోపే దాదాపు 40 శాతం భూ సమస్యలు పరిష్కారం జరిగేందుకు అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. దీంతో స్థానిక వ్యవసాయ భూముల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story