సౌర వెలుగుల దిశగా గండుగులపల్లి

by Ratna Kumari |

పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో గండుగులపల్లి గ్రామం రాష్ట్రానికే ఆదర్శంగా నిలవబోతోంది

సౌర వెలుగుల దిశగా గండుగులపల్లి
X

దిశ, దమ్మపేట : పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో గండుగులపల్లి గ్రామం రాష్ట్రానికే ఆదర్శంగా నిలవబోతోంది. నూటికి నూరు శాతం సౌర విద్యుత్తును వినియోగించుకునేలా ప్రభుత్వం చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. మంగళవారం దమ్మపేట మండలం తన స్వగ్రామమైన గండుగులపల్లిలో జరుగుతున్న ఈ ప్రాజెక్టు పనులను స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్యానెళ్ల అమెరికా విద్యుత్ కనెక్షన్ల ప్రక్రియను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.​ అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటికి పూర్తి సబ్సిడీతో సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే గ్రామస్తులకు నిరంతర విద్యుత్ సరఫరా అందడమే కాకుండా, కరెంటు బిల్లుల భారం పూర్తిగా తొలగిపోతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా వినియోగం పోను మిగిలిన విద్యుత్ ని తిరిగి గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా గ్రామస్తులకు అదనపు ఆదాయం సమకూరుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక శక్తిని ప్రోత్సహిస్తున్న తరుణంలో గండుగులపల్లి ఒక రోల్‌ మోడల్‌గా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధిలో ఈ ప్రాజెక్టు ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు దీనిని విస్తరించే అవకాశం ఉందని ఎమ్మెల్యే జారే తెలిపారు.

Next Story