- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ టు ఆంధ్ర.. కొనసాగుతున్న ఆంధ్ర వ్యాపారుల దందా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది.

దిశ, వైరా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా నుంచి నిరంతరం ఆంధ్రకు వాహనాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతోంది. ఇదంతా బహిరంగంగా జరుగుతున్న కనీసం పట్టించుకునే అధికారులే కరువయ్యారు. ఆంధ్రాకు చెందిన ముగ్గురు బడా వ్యాపారులు ఖమ్మం జిల్లా నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి అక్రమ రవాణా చేస్తుండటం పరిపాటిగా మారింది. ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి కేంద్రంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు చెందిన ముగ్గురు వ్యాపారులు ఖమ్మం జిల్లాలోని రేషన్ బియ్యాన్ని అతి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ నెలకు లక్షలాది రూపాయలను గడిస్తున్నారు. జిల్లాలోని ఎర్రుపాలెం, బోనకల్, వైరా, చింతకాని మండలాల్లో ఆంధ్ర లోని లింగాలకు చెందిన ఓ నరసింహుడు నిరాటంకంగా బియ్యం కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా వైరా, తల్లాడ మండలాలకు చెందిన రేషన్ బియ్యాన్ని నెమలి కేంద్రంగా ఇద్దరు ఏజెంట్లు ద్వారా వ్యాపారి రామచంద్రయ్య కొనుగోలు చేస్తున్నారు.
వ్యాపారులు ఈ బియ్యాన్ని 20 రూపాయలకు పైగా
నెమలిలో అధికార కుటమికి చెందిన టిడిపి పార్టీ చెందిన ఇద్దరు వ్యాపారులు ఖమ్మం జిల్లా నుంచి వచ్చే బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వైరా, కొణిజర్ల, తల్లాడ మండలాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న సదరు వ్యాపారి ఆ ఏజెంట్లు ద్వారా ముందుగా నెమలి కేంద్రానికి బియ్యాన్ని తరలిస్తున్నారు. అక్కడ నుంచి బహిరంగంగా వ్యాన్లు, లారీల్లో బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు. ఏజెంట్లు గ్రామాల్లో 12 రూపాయలకు కిలో రేషన్ బియ్యం కొనుగోలు చేసి వ్యాపారులకు 15 రూపాయలకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు ఈ బియ్యాన్ని 20 రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు. అదేవిధంగా సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి తదితర మండలాల్లో జయంతికి చెందిన రామారావు బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తూ ప్రతి నెల లక్షలాది రూపాయల అక్రమ ఆదాయాన్ని గడిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతున్న సంబంధిత అధికారులు కనీస చలనం లేకుండా పోతుంది. దీంతో నిరంతరం ఖమ్మం జిల్లాలోని ప్రధాన రహదారులపై పట్ట పగలు కూడా అక్రమంగా బియ్యం రవాణా కొనసాగుతుంది. వైరా మండలం నుంచి నిరంతరం నెమలికి బియ్యం రవాణా కొనసాగుతున్న దాడులు చేసే అధికారులు కరువయ్యారు. ఈ అక్రమ వ్యాపారంతో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పథకం లక్ష్యం నెరవేరడం లేదు. ఆంధ్రకు చెందిన ముగ్గురు బడా వ్యాపారులు నెలవారి మామూళ్లను అధికారులకు ఇస్తూ ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
జైలుకెళ్లిన లెక్కేలేదు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జయంతి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి, లింగాలు చెందిన మరో వ్యాపారి అక్రమ బియ్యం వ్యవహారంలో జైలుకు వెళ్లారు. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్రమ బియ్యం వ్యాపారంలో కేసులు నమోదయి జైలుకెల్లాల్సి వస్తుందని తెలిసినా కూడా వ్యాపారులు వెనకాడటం లేదు. అంటే ఈ వ్యాపారంలో ఎంత లాభం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే నిరంతరం ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్ర వ్యాపారులు బియ్యం అక్రమ రవాణా చేస్తున్నప్పటికీ ఇటీవల ఒక కేసు కూడా జిల్లాలో నమోదు కాకపోవటం విశేషం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే అక్రమ బియ్యం వ్యాపారం నిర్వహిస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






