- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిర్లక్ష్యపు నీడలో అటవీ అభివృద్ధి
దేశంలోనే భద్రాచలం అటవీ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతంలోని అడవి అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది.

దిశ, భద్రాచలం : దేశంలోనే భద్రాచలం అటవీ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతంలోని అడవి అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. భద్రాచలం డివిజన్ లో మొత్తం 42,178.005 హెక్టార్ల ఫారెస్ట్ ఏరియా ఉంది. దీనిలో కేవలం 856.5 హెక్టార్ల లోనే ప్లాంటేషన్ ఉంది. మిగిలిన భూమిలో ప్రకృతి సిద్ధమైన ఫారెస్ట్ ఉంది. నేచరల్ ఫారెస్ట్ ఏరియా లో ఉన్న చెట్లలో 80 శాతం వరకూ ఉపయోగపడేవి కావు. వీటి వలన అటు అటవీశాఖకు గాని, ఇటు అటవీ ఉత్పత్తులు పై ఆధారపడి జీవించే గిరిజనులకు గాని ప్రయోజనం లేదు. వేలాది హెక్టార్ల ఫారెస్ట్ ఏరియా ఉన్నాకూడా.... అటవీ అధికారులు ప్లాంటేషన్ పెంచడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడమే. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్ లో అడవి కనుమరుగు అయ్యే ప్రమాదం ఉంది.
రెండు సంవత్సరాలుగా నిలిచిపోయిన నూతన చెక్ డ్యామ్స్ నిర్మాణం
భద్రాచలం డివిజన్ లోని ఫారెస్ట్ ఏరియాలో ప్రస్తుతం 28 చెక్ డ్యామ్స్ ఉన్నాయి. ఈ చెక్ డ్యామ్స్ లో నీరు నిల్వ చేయడం వలన అటవీ జంతువులు దాహర్తి తీర్చుకోవడం తో పాటు, ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగి అటవీ విస్తరణకు ఉపయోగ పడతాయి. ప్రతి సంవత్సరం వేసవిలో చెక్ డ్యామ్స్ లో పూడిక తీయాల్సి ఉంటుంది. దీని ద్వారా వర్షాకాలంలో ఎక్కువ నీరు నిలవడానికి అవకాశం ఉంది. అయితే గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో నిర్వహణ లేక చెక్ డ్యామ్స్ కనుమరుగు అయ్యాయి. నూతన చెక్ డ్యామ్స్ కూడా నిర్మించక పోవడంతో, అడవి జంతువులు తాగడానికి నీరు లేక మరణిస్తున్నాయి.
100 హెక్టార్లలో 2 లక్షల మొక్కలు నాటుతున్నాం... ఎఫ్ డి ఓ కోటేశ్వరరావు
అటవీ అభివృద్ధి గురించి భద్రాచలం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కోటేశ్వరరావు ను దిశ వివరాలు కోరగా.... 2026-27 సంవత్సరంలో 100 హెక్టార్లలో నూతన ప్లాంటేషన్ వేయబోతున్నట్లు తెలిపారు. భద్రాచలం రేంజ్ లో 50 వేల మొక్కలు, దుమ్ముగూడెం రేంజ్ లో లక్ష మొక్కలు, చర్ల రేంజ్ లో 50 వేల మొక్కలు నూతనంగా నాటుతున్నామని, దీనికొరకు రూ. 45,34,918 నిధులు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్ లో ప్లాంటేషన్ ఏరియా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు ఆయన తెలిపారు.






