- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్షల్లో జనాభా.. వందల్లో దరఖాస్తులు
ఐదు లక్షల జనాబా, రోజుకు 600వందలకు పైగా దరఖాస్తులు, విద్యాసంస్థలు తెరిచిన సమయంలో దరఖాస్తుల సంఖ్య సుమారు 1000కు చేరుతాయి... ఇది అర్బన్ తహసీల్దార్ కార్యాలయం పరిస్థితి.

ఐదు లక్షల జనాబా, రోజుకు 600వందలకు పైగా దరఖాస్తులు, విద్యాసంస్థలు తెరిచిన సమయంలో దరఖాస్తుల సంఖ్య సుమారు 1000కు చేరుతాయి... ఇది అర్బన్ తహసీల్దార్ కార్యాలయం పరిస్థితి. ఇక్కడి సిబ్బందిపై విపరీతమైన పని ఒత్తిడితో ఇక్కడ ఏ దరఖాస్తు అయినా నెలల తరబడి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. లక్ష జనాభా దాటిన ప్రాంతాల్లో మరో తహసిల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో ఖమ్మంలో మరో తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. గతంలో రెండో తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేసినా, అది ఆచరణలోకి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రకటనతో రెండో కార్యాలయం ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. దిశ, ఖమ్మం కార్పొరేషన్
దిశ. ఖమ్మం కార్పొరేషన్: ఖమ్మం నగర జనాభా సుమారు ఐదు లక్షలకు చేరింది. ఖమ్మం నగరంలో ఖమ్మం అర్బన్ తహసిల్దార్ కార్యాలయం ఒకటే ఉండటంతో అధికారులు, ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగి, ప్రజలకు పౌర సేవలు సరిగా అందించలేకపోతున్నారు. 50వేల జనాభా పరిధిలో ఏర్పాటుచేసిన మండల తహసిల్దార్ కార్యాలయంలో ఎంతమంది సిబ్బంది ఉంటారో, ఐదు లక్షల జనాభా పరిధిలో ఉన్న అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో కూడా అంతేమంది సిబ్బంది ఉండటం గమనార్హం. దీంతో పని ఒత్తిడి ఉద్యోగుల ఆరోగ్యాలపై ప్రభావం చూపెడుతోంది. అంతేకాకుండా వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు నెలల తరబడి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ ధృవపత్రం, జనన మరణాల ధ్రువీకరణ పత్రాలు తదితరాలు కావాలంటే నరకం కనబడుతుంది. ఇక జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు.ఇతర ప్రముఖులుతరచూ ఖమ్మం వస్తుంటారు. వారికి ప్రొటోకాల్ బాధ్యత కూడా అర్బన్ తహసిల్దార్ కార్యాలయానిదే. దీంతో తహసీల్దార్, ఆర్ఐలు తరచూ ప్రోటోకాల్ విధులకు హాజరు కావాలి. కాగా లక్ష జనాభా దాటిన ప్రాంతాల్లో మరో తహసిల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో ఖమ్మంలో మరో తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. గతంలో రెండో తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేసినా, అది ఆచరణలోకి నోచుకోలేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రకటనతో రెండో కార్యాలయం ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి.
రోజుకు 600కు పైగా దరఖాస్తులు
వివిధ ధ్రువ పత్రాలు కోసం ఖమ్మం అర్బన్ తహసిల్దార్ కార్యాలయానికి రోజుకు 600కు పైగా దరఖాస్తులు వస్తుంటాయి. నివాస, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ధ్రువీకరణ పత్రాలు కూడా మీ సేవ ద్వారా ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి వస్తుంటాయి. మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను కార్యాలయంలో ఆమోదిస్తేనే ధ్రువ పత్రాలు వస్తాయి. విద్యాసంస్థలు తెరిచిన సమయంలో దరఖాస్తుల సంఖ్య సుమారు 1000 కు చేరుతుంది. దీంతో ధ్రువపత్రాల పరిశీలనకే సమయం అంతా సరిపోతుంది.
పనుల్లో తీవ్ర జాప్యం
ఖమ్మం నగర జనాభా పెరిగిపోవడంతో ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో పనుల్లో విపరీతమైన జ్యాప్యం ఏర్పడుతున్నది. భూముల సర్వేకు దరఖాస్తు చేస్తే నెలల తరబడి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ వంటి దృవపత్రాలు ఇచ్చేందుకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు విచారణ చేయాల్సి ఉంటుంది. అయితే వివిధ పనుల ఒత్తిడితో వారికి ధ్రువపత్రాలు మంజూరుకు నెలల సమయం తీసుకుంటున్నారు. ఇక ఈఎస్‌డబ్ల్యూ వంటి ధ్రువపత్రాలు మంజూరుకు చుక్కలు చూడాల్సిందే. ప్రభుత్వం నుంచి పట్టాలు పొందిన వారు ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయానికి ఇంటి నెంబర్ కోసం వస్తే, సదరు పట్టాలు నిజమైనవా? కావా? అని పరిశీలనకు ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం పంపుతారు. అయితే ధ్రువీకరణ ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇంటి నెంబర్ల కోసం కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరుగుతుంటే వారిని అర్బన్ తాసిల్దార్ కార్యాలయానికి వెళ్ళమని చెబుతున్నారు. అక్కడ కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. పని ఒత్తిడి ఉందని చెపుతున్నారు. రెండో తాసిల్దార్ కార్యాలయం ఏర్పడితే ప్రజలకు తిప్పలు తప్పుతాయి.
గతంలోనే ప్రతిపాదనలు
ప్రజలకు పౌర సేవలు జాప్యం లేకుండా ఉండాలని గతంలోనే ఖమ్మంలో రెండో తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేశారు. నగరంలోని ఖానాపురం హవేలీ ప్రాంతంలో కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు స్థలాన్ని కూడా ఖరారు చేశారు. ఖమ్మం కార్పొరేషన్లో విలీనమైన గ్రామపంచాయతీలను రెండో తహసీల్దార్ కార్యాలయం పరిధిలోకి తేవాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. అయితే ఆ ప్రతిపాదనలు బుట్ట దాఖలు అయ్యాయి. ఏండ్ల తరబడి ఆచరణకు నోచుకోలేదు. అయితే లక్ష జనాభా దాటిన ప్రాంతాల్లో మరో తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జిల్లా మంత్రి ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ప్రజలకు కోరుతున్నారు.






