- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బూర్గంపాడులో ఫైనాన్స్ మాఫియా..
బూర్గంపాడులో ఐదు నుండి పది శాతం వడ్డీలతో ఫైనాన్స్ దందా జోరుగా సాగుతోంది.

దిశ, బూర్గంపాడు: అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతం. అక్కడ నివసించేది అమాయక గిరిజనులు, రెక్కాడితే గాని డొక్కాడని చిరువ్యాపారులు. వీరి అవసరాలే పెట్టుబడిగా, పేదరికమే పెట్టుబడిగా బూర్గంపాడు మండలంలో అక్రమ ఫైనాన్స్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ప్రభుత్వ నిబంధనలు, లైసెన్సులు ఏవీ లేకుండానే ‘డైలీ ఫైనాన్స్’, ‘చిట్టీల’ పేరుతో కొందరు అక్రమార్కులు బహిరంగంగానే దోపిడీకి తెరలేపారు. అధిక వడ్డీల కోరల్లో చిక్కుకుని సామాన్యులు రోడ్డున పడుతున్నా.. సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బూర్గంపాడు మండల కేంద్రంతోపాటు దాని పరిధిలోని గిరిజన గ్రామాల్లో ఈ అక్రమ వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతోంది. మధ్యతరగతి ప్రజలు, చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేవారు, గిరిజనులే లక్ష్యంగా ఈ మాయాజాలం నడుస్తోంది. ‘ఈరోజు డబ్బులు తీసుకో.. రేపటి నుండి రోజువారీ లేదా వారపు వాయిదాల్లో కట్టేయ్’ అంటూ ఆశ చూపి వల విసురుతున్నారు. తీరా అప్పు తీసుకున్నాక అసలు కంటే వడ్డీయే కొండంతై కూర్చుంటోంది. ఐదు నుండి పది శాతం వరకు అధిక వడ్డీని వసూలు చేస్తూ దర్జాగా దందా సాగిస్తున్నారు. స్థానికంగా ఈ దందాను ‘ఆవకాయ ఫైనాన్స్’ అని కూడా పిలుస్తుండటం గమనార్హం.
ఆంధ్రా ముఠాల అక్రమ వడ్డీ దుకాణాలు
ఈ అక్రమ దందా కేవలం స్థానికులకే పరిమితం కాలేదు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, గుంటూరు, విజయవాడ వంటి నగరాల నుండి వచ్చిన కొందరు అక్రమ వ్యాపారులు ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో వడ్డీ దుకాణాలు తెరిచారు. ఎలాంటి అనుమతులు లేకుండా, చట్టాలను బూడిదలో పోసిన పన్నీరు చేస్తూ వీరు బహిరంగంగానే వడ్డీ వసూళ్లకు పాల్పడుతున్నారు. అమాయక ప్రజలు తమ వ్యాపారాల కోసం, అత్యవసరాల కోసం ఈ ఫైనాన్స్‌లను ఆశ్రయించి, ఆ తర్వాత కట్టలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక, కష్టపడి సంపాదించినదంతా వడ్డీలకే కట్టేస్తూ చిరువ్యాపారులు, కూలీలు రోడ్డున పడుతున్న పరిస్థితులు మండలంలో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి.
అధికారుల ‘మామూలు’ నిర్లక్ష్యం...?
ఇంత బహిరంగంగా, పగటిపూటే ఈ అక్రమ ఫైనాన్స్, చిట్టీల దందా సాగుతున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అక్రమార్కుల నుంచి అందుతున్న ‘మామూళ్ల’ వల్లే అధికారులు కళ్లు మూసుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి చట్టబద్ధత లేని ఈ ప్రైవేట్ ఫైనాన్స్ నిర్వాహకుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అమాయక గిరిజనులను, చిరువ్యాపారులను నిలువునా దోచుకుంటున్న ఈ అక్రమ డైలీ ఫైనాన్స్, చిట్టి వ్యాపారులపై తక్షణమే విచారణ జరిపించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, బూర్గంపాడు మండల వ్యాప్తంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ లేదా పోలీస్ తనిఖీలు చేపట్టి, అనుమతులు లేని ఫైనాన్స్ సంస్థలను సీజ్ చేయాలని, నిర్వాహకులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






