- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ లో చైర్మన్ పీఠం కోసం తీవ్ర పోటీ
త్వరలో జరగనున్న వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేసి చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. చైర్మన్ పదవీ కోసం రోజు రోజుకు ఆశావాహుల సంఖ్య పెరిగిపోతుంది.

దిశ, వైరా : త్వరలో జరగనున్న వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేసి చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. చైర్మన్ పదవీ కోసం రోజు రోజుకు ఆశావాహుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ పదవీ కోసం తమకున్న మార్గాల ద్వారా ఆశావాహులు ఎవరి ప్రయత్నాలు వారు తీవ్రంగా చేసుకుంటున్నారు. ఇప్పటివరకు తెరపైకి ఆరుగురు అభ్యర్థులు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా వైరాకు చెందిన ప్రముఖ వైద్యురాలు, గైనకాలజిస్ట్ కాపా చంద్రకళ చైర్మన్ రేసులో ఉన్నారు. ఆమె గత 20 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. ఆమె భర్త కాపా మురళీకృష్ణ అనెస్థిషియా డాక్టర్ గా పని చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన గతంలో లయన్స్ క్లబ్ తరఫున గవర్నర్ గా గెలుపొందారు. ఖమ్మం జిల్లాలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కాపా మురళీకృష్ణ అనేక సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించి ప్రస్తుతం ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ గా కొనసాగుతున్నారు . ఒకవైపు వైద్య వృత్తితో పాటు మరోవైపు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ దంపతులు రాజకీయ క్షేత్రంలో పోటీలో నిలిచేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ సతీమణి పువ్వాళ్ళ హిందుమతి కూడా చైర్మన్ రేసులో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అంచెలంచెలుగా ఎదిగి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవీ..
వైరా మేజర్ గ్రామపంచాయతీ గా ఉన్న సమయంలో పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ సర్పంచ్ గా పని చేశారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవీని అలంకరించారు. ఇటీవల వైరాకు చెందిన నూతి సత్యనారాయణ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. భవిష్యత్తులో దుర్గాప్రసాద్ కు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉన్నత పదవులు లభించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా పల్లిపాడు గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాంపూడి రోశయ్య కోడలు రాంపూడి రాజ్యలక్ష్మి చైర్మన్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. కష్టకాలంలో కూడా ఆయన పార్టీని వీడకుండా రోశయ్య ఎన్నికల్లో పని చేశారు. వైరా మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు సతీమణి ముళ్లపాటి విజయలక్ష్మి, కాంగ్రెస్ నాయకుడు కొప్పురావూరి శబరినాథ్ సతీమణి కొప్పురావురి ప్రవళిక, యడ్లపల్లి వీరయ్య చౌదరి సతీమణి యడ్లపల్లి వనజ కూడా చైర్మన్ బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆశావాహులు కౌన్సిలర్ గా పోటీ చేసే స్థానాలపై కూడా చర్చ జరుగుతోంది. జనరల్ మహిళకు రిజర్వేషన్ అయిన 6వ వార్డు నుంచి కాపా చంద్రకళ పోటీ చేస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అ వార్డు పొత్తుల్లో ఇతర పార్టీలకు కేటాయిస్తే 3 లేదా 5వ వార్డుల్లో ఆమె పోటీ చేసే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పువ్వాళ హిందుమతి, రాంపూడి రాజ్యలక్ష్మి 15వ వార్డులో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది. ముళ్ళపాటి విజయలక్ష్మి 13వ వార్డులో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 12వ వార్డు నుంచి కొప్పురావురి ప్రవళికతో పాటు యడ్లపల్లి వనజ పోటీ చేస్తారని చర్చ జరుగుతోంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులు ఎవరిపై ఉంటాయనే విషయం ఉత్కంఠగా మారింది.
తెరపైకి అనూహ్య పరిణామాలు..
వైరా మున్సిపల్ ఎన్నికలకు సమయం ఉండటంతో చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ లో తెరపైకి అనూహ్య పరిమాణాలు వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న ఓ వర్గం వారు చైర్మన్ పదవి కోసం పట్టుబట్టే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతుంది. ఇదే జరిగితే తెరపైకి మరి కొంతమంది ఆశావాహుల పేర్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీపీఎం, టీడీపీ లతో పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తిగా ఉంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సీపీఎం, టీడీపీ పార్టీలతో చర్చలు జరిపినట్లు సమాచారం. పొత్తుల్లో భాగంగా సీపీఎం, టీడీపీ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ కేటాయించే వార్డుల్లో రెబల్ అభ్యర్థుల బెడద ఉంటుందనేది కాంగ్రెస్ నాయకులు కొంతమంది తమ అభిప్రాయంగా చెబుతున్నారు. ఏది ఏమైనా వైరా మున్సిపాలిటీ ఎన్నికల వేళ చైర్మన్ పదవి తీవ్ర రాజకీయ ఉత్కంఠను రేపుతుంది.






