భూ వివాదాలు పరిష్కారం కోసం దమ్మపేట మండల రైతుల ఎదురుచూపులు

by Malleboina Mahesh |

దమ్మపేట మండల రైతుల తమ భూములు వివాదాల పరిష్కారం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

భూ వివాదాలు పరిష్కారం కోసం దమ్మపేట మండల రైతుల ఎదురుచూపులు
X

దిశ, దమ్మపేట: దమ్మపేట రెవెన్యూ కార్యాలయంలో జరిగిన పరిణామాలు, వివాదాలు, పాలకుల పాపాలతో విసిగిపోయిన ప్రజలు.. ఇప్పుడు పూర్తిస్థాయిలో 'రెవెన్యూ ప్రక్షాళన' జరగాలని ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. దమ్మపేట నూతన తహసీల్దార్‌గా విధుల్లోకి చేరిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళి రాకతో తమ కన్నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని పేదలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.

దళారుల కబంధ హస్తాల్లో ఆఫీస్..

గతంలో దమ్మపేట రెవెన్యూ కార్యాలయం దళారులకు, అక్రమార్కులకు అడ్డాగా మారిందనే తీవ్ర విమర్శలున్నాయి. ఏకంగా నకిలీ మరణ, వారసత్వ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, క్షేత్రస్థాయిలో విచారణను గాలికొదిలేసి విలువైన భూములను ఇతరులకు బదలాయింపు చేసిన మహా కుంభకోణాలు ఇక్కడే వెలుగుచూశాయి. ఈ అక్రమాలకు వత్తాసు పలికిన అప్పటి మండల స్థాయి అధికారి, జీపీవోలపై జిల్లా కలెక్టర్ స్వయంగా విచారణ జరిపించి సస్పెన్షన్ వేటు వేయాల్సిన పరిస్థితి దాపురించింది. పాలకుల నిర్లక్ష్యం, కిందిస్థాయి సిబ్బందితో కుమ్మక్కై సాగించిన ఈ చీకటి దందాతో వల్ల.. అసలైన హక్కుదారులు, అమాయక రైతులు తమ భూములను కోల్పోయి రోడ్డున పడ్డారు. కార్యాలయంలో చాడీలు చెప్పేవారికి, రాజకీయ పలుకుబడి ఉన్నవారికి మాత్రమే పనులు జరుగుతాయనే అపఖ్యాతి మూటగట్టుకుంది.

కొండలా పేరుకుపోయిన సమస్యలు

మండలంలోని నాచారం, ముష్టిబండ, నాగుపల్లి, దమ్మపేట తదితర గ్రామాల్లో భూ వివాదాలు గుట్టలుగా పేరుకుపోయాయి. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాల గొడవలు, భర్త చనిపోయిన ఒంటరి మహిళలకు దక్కాల్సిన వారసత్వ వాటాలు, పొలాలకు వెళ్లే దారి తగాదాలు ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీనికి తోడు కోర్టు కేసులు, ఎల్టీఆర్ తీర్పులు, పీవోటీ కేసులు, అసైన్‌మెంట్ భూముల వివాదాలు రైతులను నిత్యం వేధిస్తూనే ఉన్నాయి. సుమారు ఐదు వేల మందికి పైగా రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసినా, ఇంకా సాంకేతిక కారణాలతో కొందరివి పెండింగ్‌లోనే ఉండిపోయాయి. అధికారుల చుట్టూ తిరిగే రాజకీయ దళారులు, 'మేమే పనులు చేయిస్తాం' అని చెప్పుకునే పైరవీకారుల వ్యవస్థకు నూతన తహసీల్దార్ మద్దినేని మురళి పూర్తిగా చెక్ పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Next Story