- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'అసలు'కు మించి నకిలీ... వైరాలో ఎలక్ట్రానిక్ వస్తువుల దందా!
బ్రాండెడ్ కంపెనీ ఎలక్ట్రానిక్ వస్తువుల కంటే మించి నకిలీ వస్తువులు కంటి చూపుకు తళ తళ మెరుస్తూ కనిపిస్తుంటాయి.

దిశ, వైరా: బ్రాండెడ్ కంపెనీ ఎలక్ట్రానిక్ వస్తువుల కంటే మించి నకిలీ వస్తువులు కంటి చూపుకు తళ తళ మెరుస్తూ కనిపిస్తుంటాయి. అయితే కేవలం చూపులకే ఆ వస్తువుల్లో నాణ్యత కనిపిస్తుంది. ఆ వస్తువులు బ్రాండెడ్ వస్తువులు అని నమ్మి కొనుగోలు చేసిన తర్వాత అసలు వ్యవహారం బయటపడుతుంది. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన అసలు వస్తువులు మించి నకిలీ వస్తువులు చూపులకు షైనింగ్ గా ఉంటున్నాయి. ఆ నకిలీ వస్తువులపై అచ్చు గుద్దినట్టు బ్రాండెడ్ కంపెనీ పేర్లు కనిపిస్తున్నాయి. దీంతో నకిలీ వస్తువులే బ్రాండెడ్ కంపెనీ వస్తువులని వినియోగదారులు కొని మోసపోతున్నారు. ఇది వైరాలో కొనసాగుతున్న ఎలక్ట్రానిక్ వస్తువుల దందా. వైరాలో రాజస్థాన్ నుంచి వచ్చి ఎలక్ట్రానిక్స్ తో పాటు ఇతర పలు రకాల దుకాణాలు నడుపుతున్న వారు నకిలీ మాఫియాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పలు ప్రముఖ కంపెనీలకు చెందిన పేర్లతో విద్యుత్ వైర్లు, ఫ్యాన్లు, స్విచులు, ఇలా ఒక్కటేమిటి.... గృహ అవసరమైన అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు నకిలీవే విక్రయిస్తున్నారు. అంతేకాకుండా హార్డ్వేర్ షాపుల్లో కూడా చిన్నపాటి శీల నుంచి ఇంటి తలుపులకు ఉపయోగించే డోర్ లాకుల వరకు ప్రముఖ కంపెనీలకు దీటుగా తయారుచేసిన నకిలీ వస్తువులను విక్రయిస్తున్నారు.
వైరాల్లో పుట్టగొడుగుల్లా వెలిసిన దుకాణాలు...
వైరాలో రాజస్థాన్ కు చెందిన పలువురు వ్యాపారుల దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. వైరాలోని మధిర రోడ్డు తో పాటు, మధిర క్రాస్ రోడ్ సమీపంలో, ఎస్బిఐ వైరా టౌన్ బ్రాంచ్ పక్కన, పాత బస్టాండ్ సెంటర్లో రాజస్థాన్ చెందిన వ్యాపారులు ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్ దుకాణాలు ఏర్పాటు చేశారు. అయితే వీరంతా స్థానికంగా ఉన్న ఎలక్ట్రిషన్లకు కమీషన్ ఇస్తూ ప్రముఖ కంపెనీ పేర్లతో తయారైన నకిలీ వస్తువులను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లిన వినియోగదారులు అరకొరగా పనిచేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి వైరింగ్ కి ఉపయోగించే వైరు నుంచి ఇతర అన్ని సామాగ్రి నకిలీవే విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దుకాణాలపై అధికారుల కనీస పర్యవేక్షణ కొరవడింది. అనేకమంది వినియోగదారులు కంపెనీ పేరుతో ఉన్న ఫ్యాన్లు తీసుకొని వెళ్లి ఆ ఫ్యాన్లు సక్రమంగా తిరగత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఢిల్లీ నుంచి నకిలీ వస్తువుల దిగుమతి...
వైరాలోని పలు ప్రాంతాల్లో రాజస్థాన్ వ్యాపారులు ఏర్పాటు చేసిన దుకాణాలకు బ్రాండెడ్ కంపెనీ పేర్ల మీద తయారు చేసిన నకిలీ వస్తువులు ఢిల్లీ నుంచి సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో రాజస్థాన్ చెందిన బడా వ్యాపారులు పలు ప్రముఖ కంపెనీలకు చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఇతర వస్తువులను ఆ కంపెనీ వస్తువుల్లా అచ్చు గుద్ధిన్నట్లు నకిలీ వస్తువులను తయారు చేసి సరఫరా చేస్తున్నారు. ఢిల్లీ నుంచి ట్రాన్స్పోర్ట్ లో వైరాకు ఆ వస్తువులను దిగుమతి చేస్తున్నారు. వైరాలోని ఎస్బిఐ బ్యాంకు పక్కన ఉన్న ఓ వ్యాపారి నకిలీ వస్తువులను తన దుకాణంలో విక్రయించటంతో పాటు రెబ్బవరం గ్రామంలోని కొన్ని దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వైరాలో నకిలీ ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయాలను అరికట్టి వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
గోల్డ్ మెడల్ మెయిన్ ఒక్క రోజుకే కాలిపోయింది.
నూకవరపు అయ్యప్ప చౌదరి, వైరా
ఇటీవల వైరాలోని మధిర రోడ్ లో ఉన్న ఓ రాజస్థాన్ ఎలక్ట్రికల్ దుకాణంలో గోల్డ్ మెడల్ కంపెనీ మెయిన్ ను కొనుగోలు చేశా. ఉదయం బిగించిన మెయిన్ సాయంత్రానికి కాలిపోయింది. ఈ మెయిన్ నకిలీదిగా అనుమానం వచ్చి షాపు అతనిని ప్రశ్నించా. అయితే మెయిన్ బిగించడంలో లోపం ఉందని అతను బుకాయించాడు. వైరాలో పలువురు వినియోగదారులు ఈ నకిలీ వస్తువుల వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు.






