- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతా.. రామ మయం..భక్త జనసంద్రంగా భద్రాద్రి
హంసవాహన రూపమైన నౌకలో మంగళ వాయిద్య ఘోష

దిశ,భద్రాచలం: హంసవాహన రూపమైన నౌకలో మంగళ వాయిద్య ఘోష.. వేద పారాయణం జరుగుతుండగా... రామయ్య సూర్యప్రభ వాహనంపై వేంచేసి ఉండి ఓ వైపు భక్తులను అనుగ్రహిస్తూ... మరో వైపు పంచభూత ప్రసన్నంగా పవిత్ర గోదావరి నదిలో ఐదుసార్లు విహరించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన రామయ్య వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా దశావతారాలలో భక్తులకు దర్శనం ఇచ్చి సీతా లక్ష్మణ సమేతుడై నది విహారానికి రావడంతో గోదారమ్మ పులకించింది.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా డిసెంబర్ 31 నుంచి దశావతారాలలో భక్తులను అనుగ్రహించిన రామయ్యకు పవిత్ర గౌతమీ నదిలో హంస వాహనంలో సూర్యప్రభ వాహనంపై వేంచేసి ఉండగా తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గురువారం ఉదయం నిత్య విధి అనంతరం పగల్పత్తు సమాప్తి సూచకంగా పరకాల మునులు పరమ పదోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇప్పటి వరకు జరిపిన పరాయణలను ఈ ఉత్సవం ద్వారా పరిసమాప్తి చేశారు. సాయంత్రం 4 గంటలకు వేద మంత్రాలు, మేళతాళాలు మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు జయ జయ ద్వానాల నడుమ స్వామి వారు గోదావరి తీరం వద్దకు బయలుదేరారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంలో సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం పంచభూత ప్రసన్నంగా పవిత్ర గోదావరిలో ఐదు సార్లు, ఐదు ప్రాంతాల్లో విహరించారు. స్వామి వారు హంస వాహనం లో విహరించే సమయంలో కాల్చిన బాణసంచా వెలుగులు దివిపై నుంచి ముక్కోటి దేవతలు పూల వర్షం కురిపిస్తున్న టు భ్రమింపజేసింది. ఈ వేడుకను తిలకించడానికి సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు భద్రాద్రి చేరుకోవడంతో భద్రాద్రి భక్త ద్రి గా మారింది. భద్రాచలం దివ్యక్షేత్రం భక్తుల శ్రీరామ నామ స్మరణతో మారుమ్రోగింది.
నేడు వైకుంఠ ద్వార దర్శనం..
అధ్యయనోత్సవాలలో భాగంగా గురువారం స్వామి వారు నదీ విహారం చేయగా... ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై ఆశీనులై తెల్లవారుజామున 5 గంటలకు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వైకుంఠ ద్వారంలో రామయ్యను దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు ఇప్పటికే భద్రాద్రి చేరుకున్నారు.
ఆకట్టుకున్న రివర్ ఫెస్టివల్..
వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా ఈసారి భక్తులకు కనువిందు చేయడానికి గోదావరి తీరంలో అధికారులు రివర్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కుటీరాలు నిర్మించి గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిభించేలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ ద్వారా గిరిజన ఉత్పత్తులు విక్రయించడం కాకుండా... గిరిజనుల వంటలను భక్తులకు రుచి చూపించారు. రివర్ ఫెస్టివల్ భక్తులను ఆకట్టుకుంది.
- Tags
- bhadrachalam






