- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైరా మున్సిపాలిటీలో అంతం లేని అవినీతి..!
వైరా మున్సిపాలిటీ కార్యాలయం సాక్షిగా అధికారులు అంతులేని అవినీతికి పాల్పడుతున్నారు. మున్సిపాలిటీలోని పలు ప్రధాన విభాగాల్లో ఈ అవినీతి కొనసాగుతోంది.

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీ కార్యాలయం సాక్షిగా అధికారులు అంతులేని అవినీతికి పాల్పడుతున్నారు. మున్సిపాలిటీలోని పలు ప్రధాన విభాగాల్లో ఈ అవినీతి కొనసాగుతోంది. మున్సిపాలిటీలో ప్రభుత్వ స్థలం ఆక్రమించి ఇంటి నెంబర్ కేటాయింపు నుంచి అక్రమ వ్యాపార సముదాయాల నిర్మాణం వరకు అన్ని అధికారుల కనుసన్నల్లో కొనసాగుతున్నట్టు సమాచారం. ఇక్కడ పనిచేసే ఓ ప్రధాన అధికారి అవినీతి వ్యవహారంలో ఇతర విభాగాల అధికారులతో సమన్వయంగా పనిచేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అనేక అవినీతి అక్రమాలు మున్సిపాలిటీలో చోటుచేసుకున్న ఇప్పటివరకు జిల్లా ఉన్నతాధికారులు కనీస చర్యలు తీసుకోలేదు. గురువారం వైరాలోని మున్సిపాలిటీ కార్యాలయ సమావేశ మందిరంలో కౌన్సిలర్లతో బడ్జెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు బడ్జెట్ సమావేశంలో గతంలో జరిగిన అవినీతిపై గళం విప్పుతారని స్థానికులు భావిస్తున్నారు. కౌన్సిలర్లు మున్సిపాలిటీలో ఇటీవల బహిర్గతమైన అవినీతిపై బడ్జెట్ సమావేశంలో మాట్లాడి అవినీతి రహిత పాలనకు బాటలు వేస్తారని స్థానికులు ఆశలు పెట్టుకున్నారు.
ప్రభుత్వ భూమికి ఇంటి నెంబర్ కేటాయింపు
వైరాలోని 4వ వార్డులో ఉన్న మండల వ్యవసాయ కార్యాలయం పక్కన సుమారు 60 గజాల ప్రభుత్వ స్థలాన్ని మున్సిపాలిటీలో పనిచేసే స్పెషల్ డ్రైవ్ కార్మికుడు ఆక్రమించాడు. ఆ ప్రభుత్వ స్థలానికి మున్సిపాలిటీ అధికారులు ఇంటి నెంబర్ ను కేటాయించారు. ప్రభుత్వ స్థలంలో ఇల్లు లేకపోయినా ఇంటి నెంబర్ కేటాయించి అధికారులు తమ శిష్య భక్తిని చాటుకున్నారు. వైరా మున్సిపాలిటీలోని ఓ ప్రధాన అధికారికి స్పెషల్ డ్రైవ్ కార్మికుడు వీర విధేయుడు కావడంతోనే ఈ ఇంటి నెంబర్ కేటాయించారని విమర్శలు ఉన్నాయి. ఈ విషయాన్ని దిశ బహిర్గతం చేయటంతో కేవలం ఇంటి నెంబర్ ను సిడిఎంఏ పోర్టల్ నుంచి కమిషనర్ డిలీట్ చేశారు. అయితే అక్రమ ఇంటి నెంబర్ కేటాయింపు విషయమై ఇంతవరకు ఎవరిపై కనీస చర్యలు తీసుకోలేదు
కుట్టుకూలీ నగదు స్వాహా కథ తేల్చారు
వైరా మున్సిపాలిటీ లోని కార్మికులకు సంబంధించిన ఖాకీ దుస్తుల కుట్టు కూలీ నగదును కమిషనర్ స్వాహా చేశారు. గత ఏడాది డిసెంబర్ నెల చివరార్ధంలో రూ. 1.20 లక్షల నగదును కుట్టుకూలీ కోసమని కమిషనర్ డ్రా చేశారు. వైరాలోని మధిర రోడ్ లో ఉన్న మిట్టపల్లి సీల్స్ దుకాణం పేరుతో చెక్కు డ్రా చేసిన కమిషనర్ మూడు నెలలైనా కార్మికులకు నగదు పంపిణీ చేయలేదు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ నిధులు డ్రా చేసిన వెంటనే సంబంధిత పనులకు వెంటనే పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే దిశలో వార్త కథనం వచ్చేంతవరకు ఈ విషయం ఎవరికీ తెలవకుండా కమిషనర్ నగదు స్వాహా చేశారు. విషయం బహిర్గతం అయిన తర్వాత నగదు పంపిణీ చేసేందుకు సమయం లేదంటూ కమీషనర్ చెబుతుండటం విశేషం. స్వయానా కమిషనరే నగదును డ్రా చేసి స్వాహా చేసి మూడు నెలలు గడుస్తున్న కనీసం పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో ఆయన ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారింది.
అక్రమ నిర్మాణాలకు అంతే లేదు
వైరా మున్సిపాలిటీ లోని పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలకు హద్దు లేకుండా పోయింది. వైరాలోని జాతీయ ప్రధాన రహదారి పక్కన వ్యాపార సముదాయాల కోసం అనుమతులు లేకుండా యదేచ్చగా అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. వైరా మున్సిపాలిటీలో అనేక ఉత్తమ అవార్డుల గ్రహీత అయిన టీపీవోకు మాత్రం ఈ అక్రమ నిర్మాణాలు కనిపించడం లేదు. గత నెల రోజుల క్రితం వరకు కార్యాలయానికి రాని టిపిఓ బుధవారం చుట్టపు చూపుగా కార్యాలానికి వచ్చి పది నిమిషాల్లో తిరిగి వెళ్లిపోయారు. వైరాలోని మేరీ ఇమ్మాకులేట్ స్కూల్ నుంచి జాతీయ ప్రధాని రహదారుల ఇరువైపులా తల్లాడ రోడ్డు వరకు ఇష్టానుసారంగా భారీ స్థాయిలో రేకుల షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వీటి నిర్మాణ సమయంలో టౌన్ ప్లానింగ్ లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పనుల జరిగే ప్రాంతాలకు వెళ్లడం, అందిన కాడికి దండుకోవటం పరిపాటిగా మారింది. నిజాయితీకి ప్రతిరూపం అనే చెప్పుకునే టౌన్ ప్లానింగ్ అధికారులకు ఈ అక్రమ నిర్మాణాలు కనీసం కనిపించకపోవడం వెనక రహస్యం ఏమిటోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ద్వారా టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వైరాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. నిరంతరం వైరాలో ఉండే మున్సిపాలిటీ కమిషనర్ కూడా ఈ అక్రమ నిర్మాణాలపై కనీసం కన్నీటి చూడటం లేదు.
హకా కథ తేల్చుతారా..?
వైరా మున్సిపాలిటీలో గడిచిన ఆరు నెలల కాలంలో పారిశుద్ధ్య పనులకు సంబంధించిన సామాగ్రి కొనుగోళ్ల విషయంలో లక్షలాది రూపాయల కుంభకోణం జరిగింది. హైదరాబాద్ లోని హకా కంపెనీ కేంద్రంగా అధికారులు అవినీతికి పాల్పడినట్లు మున్సిపాలిటీ వర్గాల్లోనే తీవ్ర చర్చ జరుగుతుంది. బ్లీచింగ్, సిమెంట్ బస్తాల మొదలుకొని పారిశుధ్య పనులకు సంబంధించిన సామాగ్రి వరకు తప్పుడు బిల్లులతో అందిన కాడికి దండుకున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకి హైదరాబాద్ లోని హాకా కంపెనీలో సుమారు రూ.18 లక్షల వరకు కొనుగోలు చేసినట్లు బిల్లులు డ్రా చేశారని తెలిసింది. వీటిల్లో సుమారు 6 నుంచి 7 లక్షలు రూపాయల వరకు అవినీతికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. అవినీతిపరుల చెరలో బందీ అయిన వైరా మున్సిపాలిటీని కనీసం కాపాడే చర్యలు కూడా జిల్లా ఉన్నతాధికారులు తీసుకోవడం లేదు. ఇంత అవినీతికి పాల్పడినఅధికారుల్లో కనీసం జంకు లేకుండా పోయింది. ఈ వ్యవహారాలపై బడ్జెట్ సమావేశంలో కౌన్సిలర్లు గళం విప్పుతారా..? ఇవన్ని మాకెందుకు అని వదిలేస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే..!






