హద్దు మీరుతున్న కబ్జాదారులు...

by Taduka Kalyani |

మెకు ఉన్న ఒక్క ఆధారం ఆ భూమి మాత్రమే... అన్ని ఆధారాలు ఉన్నాయి... అనుభవదారురాలు కూడా ఆమె... అయితే ఆమెకు ఎవరు తోడు లేరు అని భావించిన భూ కబ్జాదారులు ఏకంగా ఆమెను హత్య చేసేందుకు తెగబడ్డారు.

హద్దు మీరుతున్న కబ్జాదారులు...
X

దిశ, చుంచుపల్లి: ఆమెకు ఉన్న ఒక్క ఆధారం ఆ భూమి మాత్రమే... అన్ని ఆధారాలు ఉన్నాయి... అనుభవదారురాలు కూడా ఆమె... అయితే ఆమెకు ఎవరు తోడు లేరు అని భావించిన భూ కబ్జాదారులు ఏకంగా ఆమెను హత్య చేసేందుకు తెగబడ్డారు. అన్ని ఆధారాలు ఉండి తన భూమిని కాపాడుకునేందుకు ఒంటరి వితంతు పోరాటం చేస్తోంది. అధికారులైన తనకు తోడుగా ఉండి న్యాయం చేస్తారు అనుకుంటే కంచె చేను మేసిన రీతిగా పోలీసులు కూడా నిర్లక్ష్యం వహిస్తూ కబ్జాదారుల వైపు తిరిగి సదరు ఒంటరి మహిళను ఇబ్బందుల గురి చేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే గేట్లు పగలగొట్టి చంపేస్తామని బెదిరింపుల గురి చేస్తున్నారు అసలు ఏం చేయాలో తెలియదు ఎవరిని ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందో దిక్కుతోచడం లేదు అని బాధితురాలు బోరున వినిపిస్తోంది తనకు అన్యాయం జరిగింది అని స్వయానా బాధితురాలు చెప్తున్నా కానీ పోలీసులు పెడచెవిన పెడుతున్నారు తనపై దాడి చేశారు హత్యాయత్నానికి పాల్పడ్డారు అని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆధారాలు చూపించిన కానీ ఆ రికార్డును దాచిపెట్టి సివిల్ మ్యాటర్ అని పోలీసులు మూసివేస్తున్నారు. తన భూమిని ఇతరులొచ్చి దున్నుకుంటున్నారు అని చెప్తే హడావిడిగా వచ్చి ట్రాక్టర్ను పట్టుకున్న పోలీసులు వెంటనే దొడ్డిదారిలో విడిచేశారు ఇదంతా చూసి అందరు కుమ్మకై తనకు అన్యాయం చేస్తున్నారని ఒంటరి మహిళ భూకబ్జాదారులతో ఒంటరి పోరాటం చేస్తోంది. తనకు ప్రాణహాని ఉందని మొత్తుకుంటున్న రక్షణ కల్పించాల్సిన స్థానిక పోలీసులు కాసులకు కక్కుర్తి పడి అన్యాయం వైపు నిలబడుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చుంచుపల్లి తండాలో నివసిస్తున్న సుంకర మాలతి (58 ఏళ్లు) అనే ఒంటరి మహిళకు చుంచుపల్లిలోని సర్వే నంబర్లు 90/1 నుండి 90/8 లో ఉన్న 19.04 ఎకరాల భూమి ఉంది. ఇందుకు అన్ని హక్కుపత్రాలు, పట్టాదారు మొత్తం బాధితురాలి పేరు మీద ఉంది. దీనిపై తెలంగాణ హైకోర్టు స్పష్టమైన 'స్టేటస్ కో' ఉత్తర్వులు జారీ చేసింది.

నిందితులను కాపాడుతున్న చుంచుపల్లి పోలీసులు

ఈ ఏడాది జనవరి 29న ప్రధాన నిందితుడు కున్సోత్ రమేష్ అలియాస్ డిప్లా, అతని అనుచరులు బాధితురాలిపై దాడి చేసి, గొంతు నొక్కి చంపడానికి ప్రయత్నించారు. దీనిపై కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ రికార్డ్ (ఎంఎల్సి-836) నమోదైంది. కానీ చుంచుపల్లి ఎస్హెచ్ఓ ఈ మెడికల్ రికార్డును దాచిపెట్టి, ఆన్‌లైన్ పిటిషన్లను (00019, 00022) 'సివిల్ మ్యాటర్' అని తప్పుగా క్లోజ్ చేసి నిందితులను కాపాడారు. అయితే ఈనెల 5న మళ్లీ చెన్నకేశవుల జయశ్రీ అనే వ్యక్తి భారీ ట్రాక్టర్‌తో (టీజీ 28 టీ 5084) కోర్టు ఆర్డర్ ఉన్న భూమిని దున్నడానికి రాగా, పోలీసులు ఆ ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించారు. కానీ సదరు ఎస్హెచ్ఓ ఎటువంటి ఎఫ్ఐఆర్ లేదా పంచనామా లేకుండా ఆ క్రైమ్ ప్రాపర్టీని (ట్రాక్టర్‌ను) స్టేషన్ నుండి రహస్యంగా వదిలిపెట్టారు.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తాం...

తాజాగా మళ్లీ నిందితులు గేట్లు పగలగొట్టి చంపేస్తామని బాధితురాలిని బెదిరించడంతో.. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ, డిఎస్పీ లకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేసారు. అలాగే షీ టీమ్, జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ లకు కూడా ఆధారాలతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ​హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, చుంచుపల్లిలో ఒక ఒంటరి వితంతువు భూమిని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న కబ్జాదారులకు స్థానిక చుంచుపల్లి పోలీసులు కొమ్ముకాస్తున్నారని బాధితురాలి తరపు న్యాయవాది భూక్యా రాధాకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు పోలీసుల తీరుపై జిల్లా ఎస్పీ, డీఎస్పీ, షీ టీమ్ కు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. "ఒక ఒంటరి వితంతువును లక్ష్యంగా చేసుకుని భూకబ్జాదారులు ప్రాణహాని తలపెడుతుంటే, రక్షణ కల్పించాల్సిన స్థానిక పోలీసులు.. ప్రభుత్వ ఆసుపత్రి (ఎంఎల్సి) రికార్డులను పక్కనపెట్టి నిందితులతో కుమ్మక్కవ్వడం దారుణం. అక్రమంగా క్రైమ్ వాహనాలను వదిలిపెట్టి, రికార్డులను తప్పుదోవ పట్టించిన చుంచుపల్లి ఎస్హెచ్ఓ పై వెంటనే సస్పెన్షన్ వేటు వేయాలి. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకొని, బాధితురాలికి రక్షణ కల్పించి కబ్జాదారులపై బిఎంఎస్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాము." ఈ అంశంపై వివరణ కోసం చుంచుపల్లి ఎస్సై ని సంప్రదించగా ఆయన ఫోన్ కాల్ కు స్పందించడం లేదు.

Next Story