రాష్ట్రానికి రోల్ మోడల్గా ఏదులాపురం మున్సిపాలిటీ : మంత్రి పొంగులేటి

by Batti.Sumithra |

రాష్ట్రానికే ఏదులాపురం మున్సిపాలిటీని అభివృద్దిలో రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

రాష్ట్రానికి రోల్ మోడల్గా ఏదులాపురం మున్సిపాలిటీ : మంత్రి పొంగులేటి
X

దిశ, ఖమ్మం రూరల్ : రాష్ట్రానికే ఏదులాపురం మున్సిపాలిటీని అభివృద్దిలో రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని, పేదలకు మౌళిక వసతుల కల్పన లక్ష్యంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, ఏదులాపురం మున్సిపల్ పరిధిలో గత రెండు సంవత్సరాలలో 56 కోట్ల అభివృద్ధి పనులు మంజూరు చేశామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఏదులాపురం మున్సిపాలిటీలో పర్యటించి టెంపుల్ సిటీలో 33 లక్షల 90 వేల రూపాయలతో, చిన్న తండాలో 20 లక్షల 33 వేల రూపాయలతో, సూర్యనగర్ లో 24 లక్షల 87 వేల రూపాయలతో, నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీలో 24 లక్షల 87 వేల రూపాయిలతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఏదులాపురం పెద్దతండా గ్రామపంచాయతీ పరిధిలో గత రెండు సంవత్సరాల కాలంలో 14 కోట్ల రూపాయలతో వివిధ మౌళిక వసతుల కల్పన పనులు పూర్తి చేశామని అన్నారు. ప్రజలకు మౌళిక వసతుల కల్పన, సంక్షేమ కార్యక్రమాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.

పెద్దతండాలో నూతనంగా నివాసం ఉంటున్న ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రాబోయే ఏప్రిల్ నెలలో మరో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం ప్రారంభిస్తుందని అన్నారు. ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ఉంటుందని మంత్రి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో అంగన్వాడీ భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు అందించాలని, ఇండ్ల పై నుంచి విద్యుత్ తీగల తరలింపు పనులు త్వరలో ప్రారంభమవుతాయని అన్నారు. గత రెండు సంవత్సరాల కాలంలో ఏదులాపురం పాత గ్రామ పంచాయతీలో అభివృద్ధి కోసం 56 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీలో గతంలో వచ్చిన వరదలు దృష్ట్యా ప్రభుత్వం నష్టపోయిన కుటుంబాలకు కొంత సహాయం చేశామని భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 580 కోట్ల రూపాయలతో మున్నేరు నదికి రిటైనింగ్ వాల్ యుద్ధ ప్రాతిపదికన రాబోయే వర్షాకాలం నాటికి పూర్తిచేయనున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం రాబోయే 10 రోజుల్లో కాలనీలో అవసరమైన మరమ్మత్తు పనులు కూడా చేపడతామని అన్నారు.

సన్న బియ్యం పంపిణీ, నూతన రేషన్ కార్డుల పంపిణీ, పేదల గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, గురుకులాల్లో విద్యార్థులకు డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంపు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేశారని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేసుకుంటున్నామని, ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఏదులాపురం పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిందని, సీసీ రోడ్లు, డ్రైయిన్ ప్రతి వార్డులో కల్పించేందుకు చర్యలు చేపడుతూ పట్టణాన్ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం..

ఈ సందర్భంగా మంత్రివర్యులు గుర్రాల పాడు తండాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారు నునావత్ భారతి నిర్మించుకున్న ఇంటిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి డబ్బులు జమ అయినది అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీ సునీల్ దత్, ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకుబ్, ఇర్రిగేషన్ ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో జి.నరసింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాధ్ బాబు, ఏదులాపురం మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story