- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పక్కా కమర్షియల్‌గా విద్యాసంస్థలు.. ‘తోక’పేర్లతో అదనంగా ఫీజుల వసూళ్లు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యను పక్కా వ్యాపారంగా మార్చేస్తున్నాయి.

దిశ, ఖమ్మంబ్యూరో: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యను పక్కా వ్యాపారంగా మార్చేస్తున్నాయి. బజారుకో స్కూలు వెలుస్తూ కార్పొరేట్ హంగుల అతికింపును జోడిస్తూ తల్లిదండ్రుల నెత్తిన ఫీజుల పేరిట భారాన్ని రుద్దుతున్నాయి. వీటికి తోడు పాఠశాల పేరుకు ముందుగానో, వెనుకనో ఒలింపియాడ్, డిజీ,టెక్నో, ఈ టెక్నో, ఐఐటీ, టెక్, ఇంటర్ నేషనల్, ప్లేస్కూల్ లాంటి ‘తోక’ పేర్లతో ఫీజుల అదనపు మోత మోగిస్తున్నారు. అంతేకాదు కొన్ని స్కూళ్లకు పూర్తి స్థాయి అనుమతులు లేకున్నా దర్జాగా అడ్మిషన్లు తీసుకుంటున్నారు. అనుకున్న ఫీజులు వసూలు చేస్తూ విద్యాహక్కు చట్టానికి పూర్తిగా తూట్లు పొడుస్తున్నారు.
‘తోక 'పేర్ల నిషేధం..
వాస్తవానికి ఏ స్కూల్ పేరిట ప్రభుత్వ అనుమతులు పొందారో ఆ పేరున మాత్రమే పాఠశాల నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మెజారిటీ పాఠశాలలు స్కూల్ పేరుకు ముందు లేదా వెనుక ఒక తోకను తగిలించుకుని ఆ తోక పేరిట తాము ఈఈ విషయంలో నిష్ణాతులమని, తమ దగ్గర చదివిన విద్యార్థులు అనేకమంది పెద్దపెద్ద హోదాల్లో ఉన్నారని బురిడీ కొట్టిస్తూ అడ్మిషన్లు ఇస్తున్నాయి. మిగతా స్కూళ్లకంటే తామ స్టాండర్డ్స్ ఇంటర్ నేషనల్ స్థాయి అని, ఫ్యాకల్టీ ఊదరగొడతారని డబ్చా కొట్టుకుంటూ ఫీజులు మాత్రం అనుకున్నట్లుగా దండుకుంటున్నాయి. అనుమతులు సమయంలో ఇచ్చే ఫ్యాకల్టీ వివరాలు, ఆ తర్వాత ఆయా పాఠశాలల్లో ఉన్న ఫ్యాకల్టీ వివరాలను విద్యాశాఖ అధికారులు చెక్ చేస్తే డొల్లతనం ఏంటో ఇట్టే బయటపడి పోతుంది.
అన్నీ అక్కడే..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏ స్కూల్ కు వెళ్లినా విద్యార్థుల పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు, పెన్ను, పెన్సిల్, ఎరేజర్ తో సహా ఇతర స్టేషనరీ వస్తువులు, స్కూల్ యూనిఫాం, టై, బెల్ట్, బ్యాడ్జీ సహా షూస్, సాక్స్ లాంటి విద్యార్థికి ఉపయోగపడే ప్రతీ వస్తువుకు పాఠశాలల్లోని అంతర్గత రూమే కేరాఫ్ గా మారింది. ప్రతీదీ అక్కడే కొనుగోలు చేయాలని, బయట అవి దొరకవని, ఎవరికి నచ్చిన పుస్తకాల సిరీస్ ను వారు కొనసాగిస్తూ పూర్తి బిజినెస్ గా మార్చేశారు. బయటి ధరలతో పోలిస్తే పాఠశాలల్లో అధిక ధరలు పేద, మధ్య తరగతి తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాము బయట కొనుగోలు చేసుకుంటామని, రాసివ్వాలని అడిగినా యాజమాన్యం ససేమిరా అనడం గమనార్హం. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడే కొనుగోలు చేయడం అనివార్యంగా మారింది.
కార్పొరేట్ కు విద్యాశాఖ అధికారుల సపోర్టు అధికమే..
కొన్ని కార్పొరేట్ స్కూళ్లకు విద్యాశాఖ అధికారులు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆయా మండలాల్లో కొందరు ఎంఈఓలు సహకరించి విద్యాసంస్థల దోపిడీకి సహకరిస్తున్నారనే టాక్ నడుస్తుంది. తాజాగా ఖమ్మం నగరంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో నిబంధనలకు విరుద్దంగా అధిక ధరలకు పుస్తకాలు, స్టేషనరీ విక్రయిస్తున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు వెళ్లి పరిశీలించి ఆ కార్పొరేట్ పాఠశాలలోని రెండు గదులను సీజ్ చేశారు. సీన్ కట్ చేస్తే అదేరోజు సాయంత్రం అధికారులే తిరిగి తాళం చెవిని పాఠశాల నిర్వాహకులకు అప్పజెప్పి తెల్లారినుంచే విక్రయాలు జరుపుకునేందుకు అనుమతులిచ్చారు. ఈ విషయంలో భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి బొట్ల సాగర్ అధిక ధరలకు విక్రయాలు జరిపే పాఠశాలల అనుమతులు రద్దు చేయాలని, వారికి సహకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీజను కలిసి వినతిపత్రం సమర్పించారు. పుస్తకాలు, స్టేషనరీ నిల్వ ఉంచిన గదులను సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు తాళాలను పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని ఇండియన్ యూనియన్ ముస్లీంలీగ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీబాబా విద్యాశాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
కలెక్టర్ దృష్టి సారిస్తేనే..
విద్యాసంస్థలో జరుగుతున్న ఫీజులుంతో పాటు మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు ఇతర వసతులు గురించి తెలియాలంటే కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగితే తప్ప తేలేది కాదంటున్నారు విద్య విశ్లేషకులు. చిన్న చితకా అధికారులు కార్పొరేట్ శక్తుల స్థాయిలో పనిచేయలేవని, ధిక్కార స్వరం వినిపించే కార్పొరేట్లు కలెక్టర్ ను తప్ప పట్టించుకునే పరిస్థితి లేదనే టాక్ వినిపిస్తుంది. జిల్లావ్యాప్తంగా స్కూళ్ల ప్రక్షాళతో పాటు విద్య వ్యవస్థ ప్రక్షాళన జరగాలంటే ఒక కమిటీని వేసి అన్ని విద్యాసంస్థలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్న చర్చ సాగుతుంది.






