- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పదో తరగతి పరీక్షలో డమ్మీ అభ్యర్థి...
పదో తరగతి పబ్లిక్ పరీక్షలో అసలు అభ్యర్థికి బదులుగా మరొకరితో పరీక్ష రాయించిన కేసులో ఇద్దరు నిందితులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయి మంగళవారం తీర్పు వెలువరించారు.

దిశ, కొత్తగూడెం టౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలో అసలు అభ్యర్థికి బదులుగా మరొకరితో పరీక్ష రాయించిన కేసులో ఇద్దరు నిందితులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయి మంగళవారం తీర్పు వెలువరించారు. కేసు వివరాల ప్రకారం, 2019 నవంబర్ 4న నిర్వహించిన పదో తరగతి సోషల్ స్టడీస్ పబ్లిక్ పరీక్ష సందర్భంగా కొత్తగూడెంలోని లిటిల్ బర్డ్స్ పాఠశాల పరీక్షా కేంద్రంలో తనిఖీలు నిర్వహించిన స్క్వాడ్ అధికారులు, అసలు అభ్యర్థి తెల్లం అనిల్‌కు బదులుగా పూనెం సందీప్ పరీక్ష రాస్తున్నట్లు గుర్తించారు. హాల్ టికెట్‌ను పరిశీలించిన అధికారులు అక్రమం జరిగినట్లు నిర్ధారించారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ కుసుమ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు అప్పటి కొత్తగూడెం టౌన్ ఎస్‌ఐ పి. రామయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం సేకరించిన ఆధారాలతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు, పత్రాలను పరిశీలించిన కోర్టు నిందితులపై అభియోగాలు రుజువైనట్లు తేల్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ అండ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం–1997లోని సెక్షన్ 8 కింద మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా, అలాగే ఐపీసీ సెక్షన్ 419 కింద ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నార్సింగ్ అనిల్ కుమార్ వాదనలు వినిపించగా, కోర్టు నోడల్ అధికారి ఎస్‌ఐ డి. రాఘవయ్య (కోర్టు డ్యూటీ ఆఫీసర్), డి. కామేశ్వరరావు సమన్వయం అందించారు.






