మద్యం మత్తులో డ్రైవర్ .. అదుపుతప్పి కారు బీభత్సం

by Taduka Kalyani |   (  Updated:2025-02-16 14:14:25  IST  )

అతిగా మద్యం సేవించి అతివేగంతో కారు నడపడంతో అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న దుకాణాల్లోకి వెళ్లి బీభత్సం సృష్టించిన సంఘటన ఆదివారం మండలంలోని ఒడ్డుగూడెo పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది

మద్యం మత్తులో డ్రైవర్ .. అదుపుతప్పి కారు బీభత్సం
X

దిశ, ఇల్లెందు: అతిగా మద్యం సేవించి అతివేగంతో కారు నడపడంతో అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న దుకాణాల్లోకి వెళ్లి బీభత్సం సృష్టించిన సంఘటన ఆదివారం మండలంలోని ఒడ్డుగూడెo పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. క్షణాల్లో జరిగిన ఈ సంఘటన చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై రెప్ప పాటులో విధ్వంసం జరగడంతో ఒక్కసారిగా జనం ఉలిక్కిపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మహబూబాద్ నుంచి ఇల్లందు వైపుకు వస్తున్న కారు నెహ్రూ నగర్ సమీపంలోని ఒడ్డుగూడెం పంచాయతీ రోడ్డు పక్కన గల శ్రీ వైష్ణవి చికెన్ సెంటర్ కిరాణా దుకాణం తో పాటు మరో రెండు డబ్బా కిరాణా దుకాణాల పైకి దూసుకెళ్లిందన్నారు.

ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై సైతం దూసుకెళ్లడంతో ద్విచక్ర వాహనం సైతం ధ్వంసం అయిందని తెలిపారు. దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చిన బుర్సు రుత్విక్ అనే బాలుడి పైకి దూసుకొని వెళ్లడంతో తీవ్ర గాయాలై కాలు విరిగిందని తెలిపారు. తీవ్ర మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు యువకులు హుటాహుటిన కారు దిగి వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారని పేర్కొన్నారు. గాయపడిన బాలుడిని వైద్య చికిత్సల నిమిత్తం వైద్యశాలకు తరలించారు. కారు నెంబర్ తో సదరు కారులో ప్రయాణించిన డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు యువకులపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story