డాక్టర్ ఉన్నా.. ఫార్మసిస్టు లేక రోగుల ఇక్కట్లు

by Kodari Anjali |

కారేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో నెలకొన్న పరిస్థితులు అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి

డాక్టర్ ఉన్నా.. ఫార్మసిస్టు లేక రోగుల ఇక్కట్లు
X

దిశ, కారేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్య సేవలను బలోపేతం చేస్తూ పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని చెబుతున్నప్పటికీ, కారేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో నెలకొన్న పరిస్థితులు అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. వైద్యుడు అందుబాటులో ఉన్నా, మందులు పంపిణీ చేసే ఫార్మసిస్టు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు ఐదు నెలల క్రితం ఇక్కడ పనిచేసిన ఫార్మసిస్టు బదిలీ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఆ పోస్టును భర్తీ చేయలేదు. 41 గ్రామపంచాయతీల ప్రజలకు వైద్య సేవలు అందించే కీలక పీహెచ్‌సీలో ఇంతకాలంగా ఫార్మసిస్టు పోస్టు ఖాళీగా ఉండటం ఆరోగ్యశాఖ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఫార్మసిస్టు లేకపోవడంతో డాక్టర్ సూచించిన మందులను ఏఎన్‌ఎంలే పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు తమ విధులు నిర్వహిస్తూనే మరోవైపు మందుల పంపిణీ బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సి రావడంతో సేవల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఫలితంగా రోగులు గంటల తరబడి క్యూల్లో నిరీక్షించిన తర్వాతే మందులు పొందుతున్నారు.ఎక్కువసేపు వేచి ఉండలేని కొందరు రోగులు వెనుదిరుగుతుండగా, మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రులు, ఆర్‌ఎంపీలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రిని ఆశ్రయించిన పేద ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.

ప్రభుత్వం వైద్య సేవలపై చూపుతున్న శ్రద్ధ..

గ్రామీణ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న తరుణంలో కనీస సిబ్బంది నియామకాల్లోనూ ఇంతటి జాప్యం ఎందుకనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఐదు నెలలుగా ఖాళీగా ఉన్న ఫార్మసిస్టు పోస్టును భర్తీ చేయడంలో ఆరోగ్యశాఖ ఎందుకు విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన కీలక అంశంలోనూ స్పందన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తరచూ పర్యటిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, ఇలాంటి మౌలిక సమస్యలు పరిష్కారం కాకపోవడం వారి పర్యవేక్షణపై సందేహాలు వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం వైద్య సేవలపై చూపుతున్న శ్రద్ధ క్షేత్రస్థాయిలో ప్రతిఫలించాలంటే ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.కారేపల్లి వంటి పెద్ద పీహెచ్‌సీలో ఫార్మసిస్టు లేకపోవడం కేవలం ఒక ఖాళీ పోస్టు సమస్య మాత్రమే కాదు. సమయానికి మందులు అందకపోవడం వల్ల ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఫార్మసిస్టును నియమించి ప్రజల ఇబ్బందులకు ముగింపు పలకాలని కోరుతున్నారు.

వైద్యాధికారి ఏమన్నారంటే...?

ఈ విషయమై వైద్యాధికారి డాక్టర్ సురేష్‌ను వివరణ కోరగా:ఫార్మసిస్టు బదిలీ అయి సుమారు ఐదు నెలలు అవుతోంది. కొత్త ఫార్మసిస్టు నియామకం కోసం ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నాం అని తెలిపారు.

Next Story