ఖమ్మం నగరంలో ప్రణాళిక లేకుండా అభివృద్ధి పనులు

by Malleboina Mahesh |

ఖమ్మం నగరంలోని బస్ డిపో రోడ్డు వద్ద డివైడర్లు నిర్మించి, తర్వాత తొలగించడంతో లక్షలాది రూపాయలు వృధా అయ్యాయి.

ఖమ్మం నగరంలో ప్రణాళిక లేకుండా అభివృద్ధి పనులు
X

దిశ, ఖమ్మం కార్పొరేషన్: ఖమ్మం నగరంలోని బస్ డిపో రోడ్డు వద్ద డివైడర్లు నిర్మించి, తర్వాత తొలగించడంతో లక్షలాది రూపాయలు వృధా అయ్యాయి. ఖమ్మంలోని పాత డీఆర్డీఏ కార్యాలయం నుంచి మయూరి సెంటర్ వరకు నిర్మించిన డివైడర్ ను తొలగించడం ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా రహదారిని విస్తరించి, డివైడర్లు ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.20 లక్షలు మూడేళ్ల క్రితం కేటాయించారు. అంతే కాకుండా సైడ్ కాల్వలు, సెంట్రల్ లైటింగ్ కోసం నిధులు కేటాయించారు. అయితే రహదారులను విస్తరణ విస్తరించకుండానే డివైడర్ల నిర్మాణం చేపట్టడం తో ఉన్న సింగిల్ రహదారి మరింత ఇరుకైంది.

డివైడర్లు నిర్మించిన తర్వాత వాహనదారులకు సౌకర్యం కలగకపోగా తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో ఈ రహదారిపై ప్రయాణించాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఆపై గుంతలు ఉండటంతో వాహనదారులు కిందపడి ప్రమాదాలకు గురయ్యారు. అంతేకాకుండా పాదాచారులు సైతం నడిచే పరిస్థితి లేకపోయింది. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం డివైడర్లను తొలగించారు. ప్రస్తుతం రహదారి మధ్యలో పొడవుగా గుంతలా ఏర్పడింది. డివైడర్లు తొలగించిన అధికారులు చేతులు దులుపుకున్నారు తర్వాత పట్టించుకోలేదు.

నిత్యం రద్దీగా..

పాత డీఆర్డీఏ కార్యాలయం నుంచి మయూరి సెంటర్ వరకు రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. బస్ డిపో ఉండటంతో బస్సులు ఈ రహదారి గుండానే పాత బస్టాండ్‌కు అలాగే బైపాస్ రోడ్డుకు వెళ్తాయి. ఇక ఇతర వాహనాల సంగతి చెప్పనక్కర్లేదు. ఇలా వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో రహదారిని విస్తరించి, డివైడర్లు నిర్మించాలని నిర్ణయించి. ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా పనులకు సొమ్ము కేటాయించారు.

రహదారిని విస్తరించకుండానే..

రహదారిని విస్తరించకుండా నిర్మించడం తర్వాత వారిని తొలగించడంతో కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లయింది. ఈ రహదారి 60 అడుగులు అయినప్పటికీ, ఆక్రమణలకు గురి కావడంతో ఒకచోట 40 అడుగులు, మరోచోట 30 అడుగులు ఉంది. దీంతో 80 అడుగుల రహదారిగా విస్తరించి, డివైడర్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేశారు. రాజకీయ కారణాలతో ఆక్రమణలు తొలగించకుండా, రహదారి విస్తరించకుండానే డివైడర్లు నిర్మించారు. తర్వాత వాటిని తొలగించారు. ఫలితంగా భారీ ఎత్తున ప్రజాధనం వృధా అయ్యింది. అయితే కాంట్రాక్టర్ తను చేసిన పనికి బిల్లులు డ్రా చేసుకునే వెళ్లడం గమనార్హం.

Next Story