దళితబంధు లబ్ధిదారుల నిధులు కలెక్టర్ల ఖాతాలో ఉన్నాయి.. డిప్యూటీ సీఎం భట్టి సంచలన వ్యాఖ్యలు

by Kodari Anjali |

దళిత బంధు లబ్ధిదారుల నిధులు కలెక్టర్ల ఖాతాలో ఉన్నాయి. ఎంచుకున్న వృత్తి, వ్యాపారాలు నిర్వహిస్తూ దశలవారీగా పొందాల్సిన నిధులను వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

దళితబంధు లబ్ధిదారుల నిధులు కలెక్టర్ల ఖాతాలో ఉన్నాయి.. డిప్యూటీ సీఎం భట్టి సంచలన వ్యాఖ్యలు
X

దిశ బ్యూరో, ఖమ్మం: దళిత బంధు లబ్ధిదారుల నిధులు కలెక్టర్ల ఖాతాలో ఉన్నాయి. ఎంచుకున్న వృత్తి, వ్యాపారాలు నిర్వహిస్తూ దశలవారీగా పొందాల్సిన నిధులను వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత నిధులకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తాను సీఎల్పీ నేతగా ఉన్నప్పుడు చింతకాని మండలాన్ని దళిత బంధు పథకం కింద పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారని, దళిత బంధు లబ్ధిదారులందరికీ నిధుల పంపిణీ కొనసాగుతుందని ఎన్నికల తదుపరి తాను ప్రకటించినట్టుగా ఈరోజు చెక్కుల పంపిణీ చేపట్టినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.

చింతకాని మండలంలో మొత్తం 3,465 మంది లబ్ధిదారులు ఉండగా వారందరికీ సంబంధించిన పూర్తి నిధులు జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేసినట్టు వివరించారు. 3,465 మంది లబ్ధిదారులు చింతకాని మండలంలో ఉండగా ఇందులో 1,387 యూనిట్ల వారు విక్రయించడం, దారి మళ్ళించడం చేశారని దళిత బంధు యూనిట్లు ఇతరులు కొనుగోలు చేయడం, లబ్ధిదారులు వాటిని అమ్మడం చట్ట ప్రకారం చెల్లుబాటు కాదని తెలిపారు.

దళిత బంధు యూనిట్లన్నిటిని జిల్లా అధికారులు విచారిస్తున్నారు. ప్రస్తుతం 214 మంది లబ్ధిదారుల విచారణ పూర్తి చేసి రెండో విడత నిధులు పొందేందుకు అర్హులని గుర్తించి వారికి చెక్కులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం చెక్కులు పొందిన లబ్ధిదారులు వృత్తి, వ్యాపారాలు చక్కగా నిర్వహించుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని తెలిపారు. లబ్ధి పొందిన వారు చక్కగా నిర్వహించి ఆదర్శంగా నిలిస్తే మిగిలిన లబ్ధిదారులు స్ఫూర్తి పొంది అధికారులకు సహకరించి రోజున పొద్దు అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు. దారి తప్పిన యూనిట్ల వివరాలు ఇస్తే అధికారులు వాటిని విచారించి తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Next Story