రైతు ఆశీర్వాద సభ"గా భట్టి నామకరణం...

by Kodari Anjali |

సభ ప్రాంగణంని ఎంపిక చేసి “రైతు ఆశీర్వాద సభ “గా డిప్యూటీ సీఎం నామకరణం చేశారు.

రైతు ఆశీర్వాద సభగా భట్టి నామకరణం...
X

దిశ, చింతకాని: చింతకాని మండల పరిధిలోని మూడు ప్రాంతాలను సోమవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఖమ్మం జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ తో కలిసి పరిశీలించారు. మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో గల జగన్నాథపురంలో సీఎం సభకు అనువైన ప్రాంతంగా ఎంపికచేసి "రైతు ఆశీర్వాద సభ"గా భట్టి నామకరణం చేశారు. చింతకాని మండలంలోని జగన్నాథపురం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభ ప్రాంగణాన్ని అధికారికంగా "రైతు ఆశీర్వాద సభ"గా ప్రకటించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకైన రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. రైతుల కష్టానికి గౌరవం తెలుపుతూ.. వారి ఆశీర్వాదాలతోనే రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుందని పేర్కొన్నారు. అందుకే ఈ సభకు "రైతు ఆశీర్వాద సభ" అనే పేరును ఖరారు చేసినట్లు తెలిపారు.

రైతు ఆశీర్వాదమే తెలంగాణ అభివృద్ధికి..

వ్యవసాయ భూముల్లో చెమటోడ్చి అన్నదాతలుగా నిలిచిన రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతు రుణమాఫీ,పెట్టుబడి సహాయం, సాగునీటి సదుపాయాల కల్పన వంటి పలు కార్యక్రమాలు రైతుల అభ్యున్నతికే నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు వేలాదిగా రైతులు, వ్యవసాయ కూలీలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతుల ఆశీస్సులతో తెలంగాణ మరింత సస్యశ్యామలం కావాలనే సంకల్పంతో ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. "రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రైతు ఆశీర్వాదమే తెలంగాణ అభివృద్ధికి నిజమైన బలం" అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైరా శాసనసభ్యులు మాలోత్ రామదాస్ నాయక్, సూడా ఛైర్మెన్ పూవాళ్ళ దుర్గా ప్రసాద్, డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ, మత్కేపల్లి ఏఎంసీ చైర్మన్ అంబటి వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు మడుపల్లి భాస్కర్ గౌడ్, కొప్పుల గోవిందరావు, కిలారు మనోహర్, ఆవుల నాగేశ్వరావు, తోటకూరి ప్రగతి, కంచుమర్తి రామ కృష్ణ మరియు వివిధ శాఖల అధికారులు, పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Next Story