ఓటు హక్కు పోతే పౌరసత్వమే ప్రశ్నార్థకం: డిప్యూటీ సీఎం భట్టి

by Kodari Anjali |

భారత రాజ్యాంగం పౌరులందరికీ కల్పించిన ఓటు హక్కును పరిరక్షించడమే ప్రజాస్వామ్యానికి అసలైన సూత్రమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

ఓటు హక్కు పోతే పౌరసత్వమే ప్రశ్నార్థకం: డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, ఖమ్మంబ్యూరో: భారత రాజ్యాంగం పౌరులందరికీ కల్పించిన ఓటు హక్కును పరిరక్షించడమే ప్రజాస్వామ్యానికి అసలైన సూత్రమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఓటర్ల జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బిఎల్‌ఏలు బాధ్యతాయుతంగా వ్యవహరించారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. మధిర నియోజకవర్గానికి చెందిన బీఎల్‌ఏలు, వారి కుటుంబ సభ్యులతో మాటూరుపేటలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఇతర రాజకీయ పార్టీలకు చెందిన ఓటర్ల పేర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ద్వారా గుర్తించి తొలగించే కుట్రలు జరుగుతున్నాయని భట్టి ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ రకంగా ఓట్లను తొలగించి లబ్ధి పొందారని ఆరోపించారు.

నిరంతరం కష్టపడే ప్రతీ బీఎల్‌ఏ...

ఇది ప్రజాస్వామ్యానికే తీవ్ర ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు హక్కును కోల్పోతే భవిష్యత్తులో రేషన్ కార్డులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆఖరికి ఈ దేశ పౌరసత్వం కూడా ప్రశ్నార్థకమై డిటెన్షన్ సెంటర్లకు వెళ్లాల్సిన దారుణ పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతీ ఒక్కరికీ కాపాడే బాధ్యత కాంగ్రెస్ సైనికులుగా బిఎల్‌ఏలదేనని స్పష్టం చేశారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడే ప్రతీ బీఎల్‌ఏ కుటుంబం బాధ్యతను, వారి పిల్లల చదువు, ఉద్యోగ అవకాశాలలో సహకారాన్ని పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. మధిర నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు 90 శాతం ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మిగిలిన 10 శాతంలో చనిపోయిన వారి వివరాలను తొలగించడం, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని గుర్తించడం వంటి పనులను బూత్‌ల వారీగా పరిశీలించి 100 శాతం నమోదు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్న పీసీసీ ప్రతినిధులను అభినందిస్తూ, బిఎల్‌ఏలు ఎటువంటి విసుగు చెందకుండా సమన్వయంతో పనిచేసి ఈ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కోరారు.

Next Story