‘మా పెద్ది సుదర్శన్‌ను కాపాడండి’.. వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్

by Gantepaka Srikanth |

తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలుసుకున్నారు.

‘మా పెద్ది సుదర్శన్‌ను కాపాడండి’.. వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలుసుకున్నారు. సోమవారం స్వయంగా సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. అనంతరం కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అందుతున్న చికిత్స గురించి డాక్టర్లతో వాకబు చేశారు. దాదాపు అరగంట సేపు అక్కడే ఉండి డాక్టర్లతో మాట్లాడారు. కాగా, పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రపంచ స్థాయి అత్యున్నత చికిత్సను అందిస్తున్నామని, అవసరమైన మేరకు విదేశాల నుంచి కూడా డాక్టర్లతో కన్సల్టెన్సీ తీసుకుంటున్నామని డాక్టర్లు తెలిపారు. గుండె ఊపిరితిత్తులు మిగతా అవయవాలు అన్ని పనిచేస్తున్నాయని కాకపోతే కొంత బ్రెయిన్ ఇంకా పునరుత్తేజం చెందాల్సి ఉన్నదని అందుకు మరో 48 గంటలు సమయం పట్టే అవకాశం ఉన్నదని డాక్టర్లు వివరించారు.


ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో, స్పష్టమైన నిర్దిష్ట సమాచారం ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపారు. కాగా.. ఖర్చుకు వెనకాడకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవడానికి పార్టీ శాయశక్తులా కృషి చేస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఐసీయూలో వైద్య చికిత్స విధానాన్ని పరిశీలించిన అనంతరం, కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్న కేసీఆర్, వారికి భరోసాను, ధైర్యాన్ని అందించారు. డాక్టర్ల కృషితో, దేవుని దయతో, ప్రజల ఆశీర్వాదంతో ఆయన కోలుకుంటాడని కేసీఆర్ విశ్వాసాన్ని ప్రకటించారు. చివరగా "మీరేం చేస్తారో చేయండి.. కానీ మా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడండి" అంటూ డాక్టర్లకు కేసీఆర్ చేతులెత్తి నమస్కరించారు.

Next Story