దమ్మపేట బస్టాండ్ పోరాటం.. ఈ ఏడాదిలో ఇదే పెద్ద హైలైట్

by Nallavelli.Anjaneyulu |

దిశ, దమ్మపేట : కాలం వేగంగా కదులుతోంది. 2025 ఏడాది జ్ఞాపకాలను నెమరువేసుకుంటే దమ్మపేట మండల కేంద్రంలో జరిగిన బస్టాండ్ రక్షణ ఉద్యమం..

దమ్మపేట బస్టాండ్ పోరాటం.. ఈ ఏడాదిలో ఇదే పెద్ద హైలైట్
X

దిశ, దమ్మపేట : కాలం వేగంగా కదులుతోంది. 2025 ఏడాది జ్ఞాపకాలను నెమరువేసుకుంటే దమ్మపేట మండల కేంద్రంలో జరిగిన బస్టాండ్ రక్షణ ఉద్యమం ఈ ఏడాదికి మకుటాయమానంగా నిలిచింది. అభివృద్ధి పేరుతో బస్టాండ్ ఉనికిని దెబ్బతీసే ప్రయత్నాలను అడ్డుకుంటూ ప్రజలు చేసిన మహా సంగ్రామం ఇది.

రికార్డు స్థాయిలో 22 రోజుల దీక్ష

ఈ ఏడాది జూలై, ఆగస్టు మాసాల్లో మండల కేంద్రం నిరసనలతో హోరెత్తింది. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మాణానికి వ్యతిరేకంగా సామాన్య ప్రజలు, సర్వసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఏకంగా 22 రోజుల పాటు సాగాయి. ఏ రాజకీయ స్వార్థం లేకుండా, కేవలం ఊరి ఆస్తిని కాపాడుకోవాలనే తపనతో ప్రతిరోజూ ఎంతో మంది దీక్షా శిబిరానికి తరలిరావడం ఈ ఏడాదిలోనే అత్యంత అరుదైన దృశ్యం.

వినూత్న నిరసనలు, మిన్నంటిన ఆందోళన

ఈ పోరాటంలో ప్రజలు ఎంచుకున్న నిరసన మార్గాలు తీవ్ర చర్చకు దారితీశాయి. నిర్మాణ స్థలంలోనే పిండప్రదానాలు చేయడం, అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో గంగిరెద్దులకు వినతి పత్రాలు అందజేయడం. ఆర్టీసీ మొండి వైఖరికి నిరసనగా అర్థనగ్న ప్రదర్శన, మండల వ్యాప్తంగా విజయవంతంగా సాగిన దమ్మపేట బంద్ తీవ్ర చర్చకు దారి తీసాయి.

న్యాయస్థానంలో విజయం

ఆర్టీసీ అధికార్లు మొండిగా పనులు ముందుకు తీసుకెళ్లాలని చూసినా, 22 రోజుల ప్రజా ఉద్యమం ఇచ్చిన స్ఫూర్తితో న్యాయపోరాటం మొదలైంది. చివరకు హైకోర్టు స్టే విధించడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇది కేవలం ఒక స్టే ఆర్డర్ మాత్రమే కాదు, దమ్మపేట ప్రజల ఐక్యతకు దక్కిన గౌరవం. ఒక మండల కేంద్రంలో, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకధాటిగా 22 రోజుల పాటు శాంతియుతంగా పోరాటం చేయడం సామాన్యమైన విషయం కాదు. ఈ పోరాటం వల్ల దమ్మపేట ప్రజల ఐక్యత ప్రపంచానికి తెలిసింది. ప్రభుత్వ భూములు, ప్రజల సౌకర్యాల విషయంలో ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నారో నిరూపితమైంది. 2025లో దమ్మపేటలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి, మరెన్నో రాజకీయ మార్పులు వచ్చాయి. కానీ, ఆ 22 రోజుల బస్టాండ్ సమరం మాత్రం దమ్మపేట చరిత్రలో ఒక వీరోచిత ఘట్టంగా, ఈ ఏడాదికి అసలైన హైలైట్ గా నిలిచిపోతుంది.

Next Story