సీఐటీయూ ఆధ్వర్యంలో నవభారత్ గేట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా

by Kodari Anjali |

సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని కాంట్రాక్ట్ కార్మికులు యాజమాన్యాన్నిహెచ్చరించారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో నవభారత్ గేట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
X

దిశ, పాల్వంచ టౌన్: నవభారత్ కార్మిక యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం నవభారత్ మెయిన్ గేట్ ఎదుట కాంట్రాక్ట్ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్, సీనియర్ నాయకులు ఎంవీ అప్పారావు మాట్లాడుతూ.. నవభారత్ కర్మాగారంలోని పలు విభాగాల్లో 5 నుంచి 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నప్పటికీ కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, గ్రాట్యుటీ, ప్రమాద భీమా వంటి హక్కులు కల్పించడంలో యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. శాశ్వత పనుల ప్రాంతాల్లో కూడా కాంట్రాక్ట్ కార్మికులతోనే పని చేయిస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదని అన్నారు. కర్మాగారంలో మహిళా ఉద్యోగుల నియామకాలు లేకపోవడం విచారకరమన్నారు.

అధికారికంగా గుర్తించాలి..

ఫెర్రో అల్లాయిస్ విభాగంలో 12/3 ఒప్పందం ప్రకారం 55 మంది కార్మికులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 47 మంది మాత్రమే పనిచేస్తున్నారని, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. చిన్న చిన్న కారణాలతో కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, ఈ సమస్యలన్నింటినీ ఇప్పటికే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని విమర్శించారు. నవభారత్ కార్మిక యూనియన్ కమిటీని అధికారికంగా గుర్తించి కార్మికులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఈ ధర్నాతో ఆగబోమని, అవసరమైతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ధర్నా సందర్భంగా యాజమాన్య ప్రతినిధులుగా వచ్చిన హెచ్‌ఆర్‌ అధికారులు వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంతో కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్..

కోల్ ప్లాంట్‌లో పదేళ్లుగా పనిచేస్తున్న సుంకనపల్లి ప్రవీణ్ (40) విధుల నిర్వహణ కారణంగా క్యాన్సర్ బారినపడి ప్రాణాలతో పోరాడుతున్నాడని నాయకులు పేర్కొన్నారు. కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ ఏరియాకు చెందిన ప్రవీణ్‌కు భార్య సువర్ణ, కుమార్తెలు ప్రసస్థ, శ్రేష్ఠ ఉన్నప్పటికీ యాజమాన్యం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదన్నారు. ఇలాంటి బాధితులు మరెందరో ఉన్నారని, కర్మాగారంలో జరిగే ప్రమాదాలకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డా రవికుమార్, సీపీఎం పట్టణ కార్యదర్శి పి తులసిరాం, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కె సత్య, వి సత్యవాణి, వింజా రాములు, ఎస్‌కే నిరంజన్, బి కాంతి, నవభారత్ కార్మిక యూనియన్ నాయకులు గోపాల్, సుధీర్, డి సురేష్, ఎ. యాకోబు, గుర్రం రాములు, ఎండీ యాకోబు, కవిత కుమారి తదితరులు పాల్గొన్నారు.

Next Story