సింగరేణిని కాపాడేందుకే తాడిచర్ల కేటాయింపు: మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి

by Kodari Anjali |

పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో కార్మికులకు చేసిందేమీ లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి అన్నారు.

సింగరేణిని కాపాడేందుకే తాడిచర్ల కేటాయింపు: మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి
X

దిశ, కొత్తగూడెం ప్రతినిధి: సింగరేణి, కార్మికులను కాపాడేందుకే ఎటువంటి టెండర్ లేకుండా న్యాయపమైన చిక్కులు లేకుండా తాడిచర్ల -2 బొగ్గు బాయిని సింగరేణి సంస్థకు కేటాయించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన ' సింగరేణి భరోసా యాత్ర ' కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పభుత్వ హయాంలో బొగ్గు బావులను ఇష్టం వచ్చిన రీతిలో నచ్చిన వారికి కట్టబెట్టారని, దీంతో దాదాపు 2.61 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ అంశంపై సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసి బొగ్గు బావులను రద్దు చేసి అవినీతికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయించిందని, బొగ్గుబావులను టెండర్ ద్వారానే కేటాయించాలని తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. సింగరేణి సంస్థ ప్రస్తుత పరిస్థితి , కార్మికుల పడుతున్న కష్టాలు చూసి ఎలాగైనా సింగరేణి నీ కాపాడాలని బీ జే పీ ఎంపీలు, ఎమ్మెల్యే లు, బీ ఎం ఎస్ నాయకులు కలిసి అనేకమార్లు ప్రధాని నరేంద్ర మోదీ ను కలిసి విన్నవించమని, తెలంగాణ ప్రజలపై, సింగరేణి పై ఉన్న ప్రేమతో, 11 సంవత్సరాల తర్వాత టెండర్ లేకుండా తాడి చర్ల -2 బొగ్గు బ్లాక్ కేటాయించిందని వివరించారు. తాడిచర్ల -2 లో గ్రేడ్ -8 నాణ్యమైన బొగ్గు లభిస్తుందని, ఈ బ్లాక్ తో వేలాది మంది కి ప్రత్యక్షంగా , పరోక్షంగా ఉద్యోగ , ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఆనాడు నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థ కు రూ. 600 కోట్ల రూపాయలను కేటాయించి నాటి ప్రధాని వాజపేయి ఆదుకుంటే , ప్రస్తుతం ప్రధాని మోదీ బొగ్గు బ్లాక్ కేటాయించి మరోసారి ఆదుకున్నారని అన్నారు.

అవినీతి చేయడంలో పోటీ తప్ప..

బీజేపీతోనే ఏదైనా సాధ్యమేనని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు, కార్మికులు, ఉద్యోగుల అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి బీజేపీ చిత్తశుద్ధితో పనిచేస్తామని హామీ ఇచ్చారు. పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ సింగరేణి నీ అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి సింగరేణి ని బ్రస్టు పట్టించారని, కేవలం ఓటు బ్యాంకు గానే చూశారనీ, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని కొనసాగించి అవినీతిని కొనసాగించిందని విమర్శించారు. సింగరేణి భవిష్యత్ కోసం ఆలోచన చేయలేదని , బొగ్గుబ్లాక్ ల వేలంలో సింగరేణి పాల్గొనకుండా అడ్డుకున్నాయని ఫలితంగా ప్రైవేట్ కంపెనీలు పోటీ పడి దక్కించుకున్నాయన్నారు. ఇక ఒరిస్సా లోని నైనీ బ్లాక్ కోసం కాంగ్రెస్ మంత్రులు ఒకరికొకరు ఆరోపణలు చేసుకొని చివరకు బొగ్గు బ్లాక్ ను టెండర్ ప్రక్రియను రద్దు చేసారని, వారికి ఎంతసేపు సంపాదన, అవినీతి చేయడంలో పోటీ తప్ప కార్మికుల కోసం , సింగరేణి భవిష్యత్ కోసం ఆరాటపడలేదని మండిపడ్డారు. సంస్థ నిధులను ఒకరేమో సిద్దిపేట, గజ్వేల్ తరలించుకుపోతారని, సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడటానికి నిధులు ఉపయోగించుకుంటారని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్టు సంస్థ నిధులను వినియోగించుకొని నష్టాలపాలు చేసి కార్మికుల చెమటచుక్కల ద్వారా సంపాదించిన కష్టాన్ని రెండు పార్టీలు వృధా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 49శాతం వాట ఉన్న కేంద్ర ప్రభుత్వం సింగరేణిలో ఏనాడు జోక్యం చేసుకోలేదని తెలిపారు.

వేలం పాటలో పాల్గొని...

పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం తమను గుర్తించలేదని , ఇప్పుడేమో సంస్థలో అవినీతి జరుగుతుందని, విచారించి కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్, హరీష్ రావు లు లేఖలు రాయడం విడ్డూరంగా ఉందన్నారు. సింగరేణి సొమ్మును కమిషన్ ల రూపంలో దోచుకుంటున్నరని, సింగరేణి నుంచి తీసుకున్న బొగ్గు కు గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 54వేల కోట్లు బాకీ పడ్డాయని ఇప్పటివరకు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాయని , కేంద్ర ప్రభుత్వం కోలిండియా కు ఇప్పటివరకు రూపాయి బాకీ లేకుండా చెల్లిస్తున్నామని, భవిష్యత్‌లో నిర్వహించే అన్నీ వేలం పాటలో పాల్గొని సింగరేణికి అండగా ఉంటామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థను లాభాల్లోకి తీసుకురావడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ విఫలం చెందాయనీ, తాడిచర్ల బొగ్గు బ్లాక్ వలన యువతకు ఉద్యోగాలు వస్తాయని, సింగరేణి నీ రక్షించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ డీ కే అరుణ, శాసనసభ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే లు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, రామారావు పటేల్, ఎమ్మెల్సీ లు మల్కా కొమరయ్య, అంజి రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్ చెరుకు భాగ్య లక్ష్మీ, రాష్ట్ర నాయకులు జీవీకే మనోహర్, జయ శ్రీ, డాక్టర్ వెంకన్న నాయక్, రవి నాయక్, బలగం శ్రీధర్, బీ ఎం ఎస్ జాతీయ కార్యదర్శి మాధవ నాయక్, మొగిలిపాక రవి కుమార్, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రిని కలిసిన మేయర్

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి నీ కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించి శాలువ తో సన్మానించారు. అనంతరం కొత్తగూడెం బైపాస్ నిర్మాణానికి, నూతనంగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని వినతి పత్రాన్ని అందించారు.

Next Story