రాష్ట్ర విద్యుత్ రంగానికి సింగరేణి వెన్నెముకలాంటి సంస్థ: డీప్యూటీ సీఎం

by Kodari Anjali |

దేశంలోనే అగ్రగామి బొగ్గు సంస్థగా మరింత బలోపేతం కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

రాష్ట్ర విద్యుత్ రంగానికి సింగరేణి వెన్నెముకలాంటి సంస్థ: డీప్యూటీ సీఎం
X

దిశ, మణుగూరు: కొత్త బొగ్గు బ్లాకుల సాధనకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన శుక్రవారం మణుగూరు ఏరియా పీకే ఓసీ -2 ప్రకాశం ఖని ఓపెన్‌కాస్ట్ ని సందర్శించారు. గని పనితీరు, బొగ్గు ఉత్పత్తి, నాణ్యత, సంస్థ భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై అధికారులతో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. గనిలో జరుగుతున్న తవ్వకాల ప్రక్రియ, బొగ్గు ఉత్పత్తి, నాణ్యత, యంత్రాల పనితీరు, భద్రతా ప్రమాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 1976లో ప్రారంభమైన ఈ గని చరిత్ర, ఇప్పటివరకు జరిగిన బొగ్గు ఉత్పత్తి, ప్రస్తుతం అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలు, గని జీవితకాలం తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బొగ్గును స్వయంగా చేతిలోకి తీసుకుని దాని నాణ్యతను పరిశీలించారు. రాష్ట్ర విద్యుత్ రంగానికి సింగరేణి వెన్నెముకలాంటి సంస్థ అని భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బొగ్గు నిల్వల పెంపు, ఉత్పత్తి విస్తరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

దీర్ఘకాలిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని..

రాబోయే రోజుల్లో కొత్త బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించి నిర్వహించే వేలం ప్రక్రియలో సింగరేణి సంస్థ చురుగ్గా పాల్గొని కొత్త బొగ్గు బ్లాకులను సొంతం చేసుకునేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. పోటీ ప్రపంచంలో సింగరేణి తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ దేశంలోనే అగ్రగామి బొగ్గు సంస్థగా మరింత బలోపేతం కావాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు తాడిచెర్ల బొగ్గు బ్లాక్ సింగరేణికి కేటాయించడంతో సంస్థ వ్యాప్తంగా అధికారులు, ఉద్యోగులు, కార్మికుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయని ఉప ముఖ్యమంత్రికి వివరించారు. అదేవిధంగా, సంస్థ భవిష్యత్ ఉత్పత్తి అవసరాలు, దీర్ఘకాలిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పీకే ఓసీ డిప్ సైడ్ బ్లాక్‌ను కూడా సింగరేణికే కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, రాష్ట్ర విద్యుత్ రంగ అవసరాలను తీర్చడంలో, పారిశ్రామికాభివృద్ధికి ఊతమివ్వడంలో, వేలాది మంది కార్మికుల జీవనోపాధికి భరోసా కల్పించడంలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

సింగరేణి భవిష్యత్ ప్రయోజనాలను పరిరక్షించేందుకు..

సంస్థ అభివృద్ధి, విస్తరణ, కొత్త బొగ్గు బ్లాకుల సాధన, ఉద్యోగుల సంక్షేమం, ఉత్పత్తి సామర్థ్యాల పెంపు వంటి అన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. సింగరేణి భవిష్యత్ ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం చేపడుతుందని అధికారులకు హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్ అంకిత్, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్, ఎస్‌సీసీఎల్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, ఐఏఎస్, టీఎస్‌జెన్‌కో ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ హరీష్, ఐఏఎస్, ఎస్‌సీసీఎల్ డైరెక్టర్ (పర్సనల్, అడ్మినిస్ట్రేషన్ & వెల్ఫేర్) గౌతమ్ పొట్రూ, సింగరేణి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story