లేబర్ కోటా రద్దు కుట్రలను అడ్డుకుంటాం: ఐఎన్‌టీయూసీ జనరల్ సెక్రటరీ

by Kodari Anjali |

కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలను అనుసరిస్తోందని ఐఎన్‌టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ ఆరోపించారు.

లేబర్ కోటా రద్దు కుట్రలను అడ్డుకుంటాం: ఐఎన్‌టీయూసీ జనరల్ సెక్రటరీ
X

దిశ, కొత్తగూడెం సింగరేణి: కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలను అనుసరిస్తోందని ఐఎన్‌టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ ఆరోపించారు. కార్మిక వర్గాన్ని బలహీనపరచడం, రైతులను నష్టపరిచే నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అమెరికా సామ్రాజ్యవాద శక్తులకు లాభం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. భారతదేశంలోని కోట్లాది కార్మికుల హక్కులను కాలరాస్తూ, బొగ్గు గని కార్మికులకు రావాల్సిన వేజ్ బోర్డు ఏర్పాటు చేయకుండా ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్ కోటా ఎన్నికలు నిర్వహించకుండా కార్మికుల హక్కులను హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే సమ్మెలు నిర్వహిస్తామని తెలిపారు. లేబర్ కోటా రద్దు చేసే ప్రయత్నాలను ఐఎన్‌టీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, వాటిని అడ్డుకునేందుకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఐఎన్‌టీయూసీ నాయకులు పితాంబరం, ఎండి రజాక్, ఏఐటీయూసీ నాయకులు సీతారామయ్య, రాజ్‌కుమార్, వంగ వెంకట్‌తో పాటు సీఐటీయూ, హెచ్‌ఎంఎస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story