- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ.. రూ.14,115 కోట్లతో భారీ రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో దేశ మౌలిక వసతుల రంగానికి భారీ వరాలు ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ (Central Cabinet Meeting) కాసేపటి క్రితం ముగిసింది. ఈ మేరకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భేటీలో రూ.14,115 కోట్ల విలువైన భారీ రోడ్డు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేశామని అన్నారు. ముఖ్యంగా రాజధాని ఢిల్లీ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత విముక్తి కల్పించడంతో పాటు పొరుగు రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కనెక్టివిటీని పెంచేందుకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు.
ఆరు లేన్లతో ద్వారకా టన్నెల్ ప్రాజెక్టు..
కేబినెట్ నిర్ణయాల్లో భాగంగా అత్యంత కీలకమైనది ఢిల్లీలోని ద్వారకా టన్నెల్ (Dwarka Tunnel) ప్రాజెక్టు. దాదాపు రూ.6,970 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ఆరు లేన్ల అండర్‌గ్రౌండ్ టన్నెల్ రాజధానిలో ట్రాఫిక్ రద్దీని భారీగా తగ్గించనుంది. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 8.1 కిలో మీటర్ల మేర కొత్త కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇక ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న శివమూర్తి ఇంటర్‌ఛేంజ్ నుంచి ప్రారంభం కానుంది. అది అక్కడ నుంచి వసంత కుంజ్, నెల్సన్ మండేలా మార్గ్ (Nelson Mandela Marg) మీదుగా సాగుతుంది. చివరిగా బారాపుల్లా డ్రైన్ సమీపంలోని ఎలివేటెడ్ కారిడార్ గుండా ప్రయాణించి DND ఫ్లైవేకి లింక్ చేయనున్నారు. దీంతో వెస్ట్ ఢిల్లీ, గురుగ్రామ్ నుంచి సౌత్, ఈస్ట్ ఢిల్లీ వైపు వెళ్లే వారికి ప్రయాణ సమయం బాగా కలిసి రానుంది.
రిడ్జ్ అడవులకు లేదు.. ఢోకా
ఢిల్లీకి ఊపిరితిత్తులు లాంటి సదరన్ రిడ్జ్ (Southern Ridge Forest) అడవులకు ఎటువంటి నష్టం వాటిల్లకూడదని ప్రధాని మోదీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అందుకే ఈ టన్నెల్‌ను అడవికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా భూగర్భం గుండా నిర్మిస్తామని మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో దాదాపు 3.14 కిలో మీటర్ల మేర ట్విన్-ట్యూబ్ అండర్‌గ్రౌండ్ టన్నెల్ ఉండనుంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద రాబోయే ఐదేళ్లలో ఇది పూర్తి కానుంది. అదేవిధంగా ఢిల్లీ ప్రాజెక్టుతో పాటు, ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో కనెక్టివిటీని పెంచేందుకు రూ.7,145 కోట్లతో కాన్పూర్ - కబ్రాయ్ (Kanpur-Kabrai) హైవే ప్రాజెక్టుకు కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవే కాకుండా దేశంలోని 57 కీలక రైల్వే ప్రాజెక్టులకు రూ.2.60 లక్షల కోట్లు, ప్రధాన నగరాల్లో 12 కొత్త మెట్రో ప్రాజెక్టులు రూ.1.50 లక్షల కోట్లు, ఓడరేవుల ఆధునీకరణ, షిప్ రిపేర్ సదుపాయాలు, నౌకాయాన సంస్కరణల కోసం సుమారు రూ.1.50 లక్షల కోట్లు, చివరగా 5 కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంతో పాటు రూ.37,000 కోట్లతో ‘ఉడాన్’ పథకాన్ని విస్తరించబోతున్నారు.






