అభివృద్ధి పనులు నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలి: కలెక్టర్

by Kodari Anjali |

మండలంలో చేపట్టిన ప్రభుత్వ జూనియర్ కళాశాల, 100 పడకల ఆసుపత్రుల నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అభివృద్ధి పనులు నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలి: కలెక్టర్
X

దిశ, కూసుమంచి: మండలంలో చేపట్టిన ప్రభుత్వ జూనియర్ కళాశాల, 100 పడకల ఆసుపత్రుల నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పురోగతి, నాణ్యత, పనుల వేగంపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూసుమంచిలో విద్య అభివృద్ధికి కీలకమైన జూనియర్ కళాశాల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలో చేపట్టిన ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి అయితే మండలం చుట్టూ పక్కల గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, నిర్మాణ పనుల్లో నాణ్యతలో రాజీ పడకుండా, ఇంజినీరింగ్ ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. పనుల సందర్భంగా అవసరమైన నిర్మాణ సామగ్రి నాణ్యతను నిరంతరం పరీక్షించాలని, ప్రతి దశను ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల అమలులో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈతనిఖీలో వైద్యశాఖ, విద్యశాఖ ఇంజనీరింగ్ అధికారులు ఉమామహేశ్వరరావు, బుగ్గయ్య, కూసుమంచి తహసీల్దారు సైదులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story