మెనూ అమలులో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం..

by Kodari Anjali |

హాజరు పెంపు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.

మెనూ అమలులో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం..
X

దిశ, పాల్వంచ టౌన్: ప్రభుత్వం నిర్దేశించిన మెనూను కచ్చితంగా అమలు చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. బుధవారం పాల్వంచ దమ్మపేట సెంటర్‌లోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, కిచెన్ షెడ్‌తో పాటు మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదని గుర్తించిన కలెక్టర్, ప్రధానోపాధ్యాయులను వివరణ కోరారు. నిరంతరం పప్పు, అన్నం మాత్రమే వడ్డించడం సరికాదని పేర్కొంటూ, ప్రభుత్వం నిర్దేశించిన ఆహార పట్టికను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన భోజనం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా..

అనంతరం విద్యార్థుల హాజరు శాతాన్ని అడిగి తెలుసుకున్న కలెక్టర్, హాజరు పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పాఠశాలకు రాని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని, ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.పాఠశాల ఆవరణ, తరగతి గదులు, వంటశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ, నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో పాల్వంచ తహసీల్దార్ ధారా ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Next Story