- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుమ్ముగూడెం పీహెచ్‌సీలో సేవలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..
రైతుల అవసరాలు, ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ అంకిత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

దిశ, దుమ్ముగూడెం: సాగునీటి సరఫరా నిరాటంకంగా సాగడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. శుక్రవారం దుమ్ముగూడెం మండలంలో పర్యటించిన ఆయన తాలిపేరు ప్రాజెక్టు ఎడమ కాలువ, దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. వీరభద్రపురం గ్రామ పరిధిలోని తాలిపేరు ఎడమ కాలువను పరిశీలించిన కలెక్టర్ కాలువ పరిస్థితులు, నీటి ప్రవాహం, ఆయకట్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాలిపేరు ప్రాజెక్టు ద్వారా 24,700 ఎకరాలకు సాగునీరు అందుతుండగా, 46.46 కిలోమీటర్ల పొడవున్న ఎడమ కాలువ 34 డిస్ట్రిబ్యూటరీల ద్వారా సుమారు 21,100 ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు వివరించారు. కాలువలో పెరిగిన గడ్డి, పేరుకుపోయిన చెత్త, పూడికను తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఆదేశించారు.
సేవలపై ఆరా..
ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు చేరేలా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.అనంతరం దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వివిధ విభాగాలను పరిశీలించారు. ఇన్‌పేషెంట్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది హాజరు వివరాలు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీ విధానం, ఔషధ నిల్వలు, ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. పాముకాటు, తేలు కాటుకు అవసరమైన అత్యవసర మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాముకాటుకు గురైన రోగులకు అందించే చికిత్స విధానంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు సాగునీరు సకాలంలో అందించడం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యమని చెప్పారు. రైతుల అవసరాలు, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తనిఖీల్లో తహసీల్దార్ అశోక్‌కుమార్, ఇరిగేషన్ ఈఈ జానీ, డాక్టర్ రుక్మాకర్‌రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






