Snake bite : అసలే పాములు తిరుగాడే సీజన్.. బీ కేర్‌ఫుల్ !

by Javid Pasha |   (  Updated:2026-06-12 14:05:09  IST  )

ప్రతీ సంవత్సరం భారతదేశంలో సుమారు 46,000 నుంచి 58,000 మంది పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు

Snake bite : అసలే పాములు తిరుగాడే సీజన్.. బీ కేర్‌ఫుల్ !
X

దిశ, ఫీచర్స్ : మీరు గ్రామీణ ప్రాంతాలు, అటవీ సమీపంలో నివసిస్తున్నారా? అయితే బీకేర్ ఫుల్! ఎందుకంటే.. ఇది వర్షాకాలం ప్రారంభం. ఈ సీజన్‌ రైతులకు ఎంతో ఇష్టమైనదే అయినప్పటికీ, పాములు ఎక్కువగా కనిపించే సీజన్ కూడా ఇదే కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా జూన్, జులై నెలల్లో గ్రామాలు, వ్యవసాయ పొలాలు, అటవీ ప్రాంతాల్లో పాముల బెడద ఎక్కువవుతుంది. వేసవిలో నిద్రావస్థలో ఉన్న పాములు వర్షాలతో యాక్టివ్ అయి, సంతానోత్పత్తి కోసం ఎక్కువగా కదులుతాయి. ఈ సీజన్‌లో రైతులు, గ్రామవాసులు పాము కాటుకు గురయ్యే అవకాశం ఎక్కువ. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? నిపుణుల ప్రకారం.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతీ సంవత్సరం భారతదేశంలో సుమారు 46,000 నుంచి 58,000 మంది పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే ఉంటున్నారు. పాము కాటు వేసినప్పుడు తగిన చికిత్స అందకపోతే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడం చాలా ముఖ్యం.

పాము కాటు వేయగానే..

పాము కాటు వేసిన వెంటనే విషం శరీరంలోకి వ్యాపిస్తుంది. పాయిజన్ రకాన్నిబట్టి లక్షణాలు మారుతాయి. కొన్ని పాముల విషం నాడీ వ్యవస్థను (neurotoxic), మరికొన్ని రక్తం, అలాగే కణజాలాలను (hemotoxic) దెబ్బతీస్తాయి.

*న్యూరోటాక్సిక్ విషం (నాగుపాము, కట్లపాము): శ్వాసకోశం పక్షవాతం, కళ్లు మసకబారడం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయి.

*హెమటాక్సిక్ విషం (రక్త పింజరి, ఇసుక పింజరి): రక్తస్రావం, వాపు, నొప్పి, మూత్రపిండాల సమస్యలు ఎక్కువ.

ప్రమాదకరమైన పాములు ఇవే..

*రక్త పింజరి(Russell's Viper)-అత్యధిక మరణాలు – సుమారు 43%

*కట్ల పాము (Common Krait)

*నాగుపాము (Indian Cobra)

*ఇసుక పింజరి (Saw-scaled Viper)

కింగ్ కోబ్రా (నల్లత్రాచు) కూడా చాలా విషపూరితమైనది. ఇది ఎక్కువ విషం కలిగి ఉంటుంది. నాగుపాము, కట్లపాము కాటు వేసిన వెంటనే చికిత్స అందకపోతే, కాటుకు గురైన వ్యక్తి 30 నిమిషాల నుంచి 6-8 గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. రక్త పింజరి విషం కాస్త నెమ్మదిగా పని చేస్తుంది కాబట్టి సమయం ఎక్కువగా ఉంటుంది. ఏదిమైనా పాముకాటును ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాంతకం అవుతుంది.

ఏం చేయాలి?

పాము కాటు వేసిన వెంటనే బాధితుడిని కదలనివ్వకుండా, గాయం స్థానానికి టోర్నికెట్ కట్టకుండా, వెంటనే సమీప ఆస్పపత్రికి తీసుకెళ్లాలి. అక్కడ అందుబాటులో ఉన్న యాంటీ-వీనమ్ చికిత్సతో చాలా మందిని కాపాడవచ్చు. పాములను చంపడం కాకుండా దూరంగా ఉండటమే ఉత్తమ రక్షణ అని నిపుణులు అంటున్నారు. అవగాహనతో చాలా వరకు మరణాలను నివారించవచ్చు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story