Minister Azharuddin: మొహర్రం ఏర్పాట్లపై కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో మొహర్రం వేడుకలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అధికారులను ఆదేశించారు...

Minister Azharuddin: మొహర్రం ఏర్పాట్లపై కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మొహర్రం వేడుకలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో మొహర్రం ఏర్పాట్లపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టిమ్రిస్ ఛైర్మన్ ఫహీమ్ ఖురేషీ, మైనారిటీల సంక్షేమ శాఖ కార్యదర్శి బి.షఫియుల్లాతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పారిశుధ్యం, విద్యుత్, తాగునీటిపై ప్రత్యేక దృష్టి..

చారిత్రాత్మక బీబీ-కా-ఆలం ఊరేగింపుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే మొహర్రం వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆశూర్‌ఖానాల పరిసరాల్లో పారిశుధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, వీధి దీపాలు, మురుగునీటి పారుదల వ్యవస్థలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మొహర్రం ఊరేగింపుల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్లను మంత్రి ఆదేశించారు. భక్తుల రద్దీ దృష్ట్యా టీజీఎస్‌ఆర్‌టీసీ ఆధ్వర్యంలో అదనపు బస్సులను నడపాలన్నారు. అత్యవసర సేవల కోసం వైద్య బృందాలను, అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా లోపాలు తలెత్తకుండా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలు జరపాలని, పురోగతి నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. స్థానిక అవసరాల పరిష్కారం కోసం మత గురువులు, ఆశూర్‌ఖానా కమిటీలతో సంప్రదింపులు జరపాలన్నారు. మొహర్రం వేడుకలు విజయవంతం అయ్యేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పేర్కొన్నారు.

హజ్ యాత్రికులకు అజారుద్దీన్ స్వాగతం!

సౌదీ అరేబియాలో హజ్ యాత్రను పూర్తి చేసుకుని నగరానికి తిరిగి వచ్చిన తొలి విడత యాత్రికులకు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అజారుద్దీన్ యాత్రికులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో హజ్ యాత్రికుల కోసం చేసిన ఏర్పాట్లు విజయవంతమయ్యాయని హర్షం వ్యక్తం చేశారు. యాత్రికుల ముఖాల్లోని ఆనందం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, భవిష్యత్తులో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Next Story