ప్రతి బ్యాంకు ఉద్యోగి సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి: సీపీ సజ్జనార్

by Kodari Anjali |

ప్రతి బ్యాంకు ఉద్యోగి సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు.

ప్రతి బ్యాంకు ఉద్యోగి సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి: సీపీ సజ్జనార్
X

దిశ, రవీంద్ర భారతి: ప్రతి బ్యాంకు ఉద్యోగి సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. శుక్రవారం రవీంద్ర భారతిలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ధనానికి బ్యాంకు ఉద్యోగులు రక్షకులు అనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దని తెలిపారు. సైబర్ నేరాలను అరికట్టడం అనేది కేవలం పోలీసుల బాధ్యతే కాదని ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి బ్యాంకు ఉద్యోగి తమ శాఖలో జీరో మ్యూల్ అకౌంట్ ఛాలెంజ్, సేఫ్ కస్టమర్ ఛాలెంజ్ లను కచ్చితంగా పాటించాలని కోరారు. తమ శాఖలో వినియోగదారులు ఒక్కరు కూడా సైబర్ నేరాల బారిన పడకూడదని విషయాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతను కలిగి ఉండాలి..

ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ ఆక్టోపస్ ద్వారా సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. అయితే ఆయా కేసుల దర్యాప్తులో చాలామంది బ్యాంకు ఉద్యోగులకు సైబర్ నేరాలపై కనీస అవగాహన లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరవడంలో చూపిస్తున్న శ్రద్దను, సైబర్ నేరాల బాధితుల విషయంలో చూపడం లేదని తెలిపారు. కనీసం ఒక్క సైబర్ బాధితుడు కూడా లేని బ్రాంచ్ ఉద్యోగులను గుర్తించి వారికి పురస్కారాలు అందించి ప్రోత్సహించాలని సూచించారు. కేవలం వ్యాపారం లక్ష్యాలను మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతను కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం బ్యాంకు ఉద్యోగులకు సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించేందుకు వివిధ భాషలలో రూపొందించిన ప్రత్యేక బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ చిన్మయి కుమార్, సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీ బీనా వాహిద్, జోనల్ హెడ్ సుధాకర్, డీజీఎం ఆర్ మురళీకృష్ణ, సాయిబాబు, జీఎం నరేష్ బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story