రోడ్డు ఆక్రమిస్తే ఉపేక్షించం.. అక్రమ నిర్మాణాల కూల్చివేత

by Taduka Kalyani |

ప్రజలందరికీ ఉపయోగపడే పబ్లిక్ ప్రాపర్టీలపై ఎలాంటి ఆక్రమణలను సహించబోమని, రోడ్లు, కాల్వలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్ కుమార్ హెచ్చరించారు.

రోడ్డు ఆక్రమిస్తే ఉపేక్షించం.. అక్రమ నిర్మాణాల కూల్చివేత
X

దిశ, మొయినాబాద్ : ప్రజలందరికీ ఉపయోగపడే పబ్లిక్ ప్రాపర్టీలపై ఎలాంటి ఆక్రమణలను సహించబోమని, రోడ్లు, కాల్వలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్ కుమార్ హెచ్చరించారు. కనకమామిడి నుంచి వెంకటాపూర్ గ్రామానికి వెళ్లే 40 అడుగుల రోడ్డును కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో శుక్రవారం రెవెన్యూ, సర్వే, ఆర్ అండ్ బి అధికారుల సమక్షంలో మూడు జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు. ముందుగానే ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి, సర్వే నిర్వహించి మార్కింగ్ చేసినప్పటికీ స్పందించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

అక్రమాలకు అడ్డుకట్ట.. ప్రజాప్రయోజనాలకే ప్రాధాన్యం..

కూల్చివేతల సమయంలో కొందరు ఆక్రమణదారులు అధికారులపై ఒత్తిళ్లు తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని భావించి ఎలాంటి పక్షపాతం లేకుండా చర్యలు కొనసాగించినట్లు తహసీల్దార్ తెలిపారు. రోడ్డు అనేది వ్యక్తిగత ఆస్తి కాదని, గ్రామ ప్రజలందరికీ చెందిన ప్రజా ఆస్తి అని పేర్కొన్నారు. రహదారిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, అలాంటి నిర్మాణాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు, రోడ్లపై పెత్తనం చెలాయించే వారిపై ఇదే తరహా చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.

తక్షణ స్పందనతో ప్రాణం కాపాడిన ఎమ్మార్వో

కూల్చివేతల సందర్భంగా చోటుచేసుకున్న నాటకీయ ఘటనలో ఒక ఆక్రమణదారుడు తనపై పెట్రోల్ చల్లుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పరిస్థితి ప్రమాదకరంగా మారుతుండగా తహసీల్దార్ గౌతమ్ కుమార్ అప్రమత్తంగా స్పందించి అతడిని వెంటనే పక్కకు లాక్కెళ్లి సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. కూలిన గోడలు మళ్లీ కట్టుకోవచ్చుగానీ ప్రాణం పోతే తిరిగి తీసుకురాలేమనే భావనతో స్పందించిన తహసీల్దార్ చర్యలను గ్రామస్తులు, రోడ్డు వినియోగదారులు, కనకమామిడి గ్రామస్తులు అభినందించారు. ప్రజా ఆస్తులను కాపాడడంలోనూ, ఒక వ్యక్తి ప్రాణాన్ని రక్షించడంలోనూ స్థానిక ఎమ్మార్వో గౌతమ్ కుమార్ చూపిన బాధ్యతాయుత వైఖరికి స్థానికుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. కార్యక్రమంలో తహసీల్దార్ గౌతమ్ తో పాటు మండల గిర్దవర్ రాజేశ్, సర్వేయర్ జలజ, పంచాయతీ రాజ్ డిఈ విజయ్ కుమార్, కనకమామిడి పంచాయతీ కార్యదర్శి దేవేందర్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది కనకమామిడి జీపీఓ అజిజ్, గ్రామ నాయకులు మురళీధర్ రెడ్డి, పలువురు వార్డ్ మెంబర్లు, మండల జీపీఓలు రామకృష్ణ, జానకి రామ్, భాస్కర్, గణేష్, నర్సింహా, రాజేష్, ఏఎస్ఐ వీరారెడ్డి, పోలీస్ సిబ్బంది కృష్ణయ్య, రోజా, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story