- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > వరంగల్ > సింగరేణిలో రూ.100 కోట్ల టెండర్ స్కాం.. రూ.40 వేల కోట్ల నష్టాల్లో సంస్థ
సింగరేణిలో రూ.100 కోట్ల టెండర్ స్కాం.. రూ.40 వేల కోట్ల నష్టాల్లో సంస్థ
by Taduka Kalyani |
సింగరేణి టెండర్ల వ్యవహారంలో రూ.100 కోట్ల అవినీతి జరిగిందని, ప్రస్తుతం సింగరేణి సంస్థ రూ.40 వేల కోట్ల నష్టాలతో నడుస్తోందని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు.

X
దిశ, భూపాలపల్లి ప్రతినిధి: సింగరేణి టెండర్ల వ్యవహారంలో రూ.100 కోట్ల అవినీతి జరిగిందని, ప్రస్తుతం సింగరేణి సంస్థ రూ.40 వేల కోట్ల నష్టాలతో నడుస్తోందని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. శుక్రవారం భూపాలపల్లిలో బొగ్గు నిల్వల వ్యవహారాన్ని పరిశీలించేందుకు వచ్చిన హరీష్‌రావును పోలీసులు ఓసీపీల సందర్శనకు అనుమతించలేదు. అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సింగరేణి ఉద్యోగులు, బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కారుణ్య నియామకాలు చేపట్టలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,600 మందికి కారుణ్య నియామకాలు కల్పించిందని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేసి కారుణ్య నియామకాలు నిలిపివేసి కార్మికులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. తాను గోదావరిఖని, భూపాలపల్లిలో సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన తర్వాతే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మెడికల్ బోర్డును పునరుద్ధరిస్తామని ప్రకటించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో తక్కువ ఎక్సెస్‌తో టెండర్లు జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్సెస్ ఎందుకు పెరిగిందో చెప్పాలని ప్రశ్నించారు.
కాంగ్రెస్-బీజేపీ కలిసి సింగరేణిపై కుట్ర
సోలార్ పవర్ ప్రాజెక్టుల్లో కూడా భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, ఒక మెగావాట్ ప్రాజెక్టు వ్యయం రూ.3 కోట్లు ఉండగా రూ.7 కోట్లకు టెండర్లు ఖరారు చేశారని అన్నారు. దీంతో ఒక్కో మెగావాట్‌కు రూ.4 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. 67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ టెండర్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఆయన, జైపూర్ పవర్ స్కాం వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్రాంతంలో సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు పేరుతో జరుగుతున్న వ్యవహారాలపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమని, బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల పిల్లలు ఉన్నత స్థాయికి చేరాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కన్నారని తెలిపారు. అయితే ఆ లక్ష్యాలను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసిందని విమర్శించారు. సింగరేణికి సంబంధించి కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని ఆరోపించిన హరీష్‌రావు, కాంగ్రెస్-బీజేపీ కలిసి సింగరేణిపై కుట్ర చేస్తున్నాయని అన్నారు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి ఈ వ్యవహారంలో ప్రమేయం లేకపోతే వెంటనే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. "కాంగ్రెస్ హటావో – సింగరేణి బచావో" నినాదంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, ఎమ్మెల్సీ పుట్ట మధుకర్, సింగరేణి నాయకులు రాజ్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






