చింతకాని సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్..

by Taduka Kalyani |   (  Updated:2026-07-06 13:24:31  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొననున్న చింతకాని బహిరంగ సభ ఏర్పాట్లను ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

చింతకాని సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్..
X

దిశ, చింతకాని: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొననున్న చింతకాని బహిరంగ సభ ఏర్పాట్లను ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని సందర్శించిన వారు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, జరుగుతున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను మంగళవారం లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణం లో రైతులకు ఉపయోగపడే విధంగా రైతు మేళా నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచనలు జారీ చేశారు. రైతులకు ప్రభుత్వ పథకాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయ యంత్రాలు, పంటల సాగుకు సంబంధించిన అవగాహన కల్పించేలా మేళాను ఏర్పాటు చేయాలని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభకు హాజరవుతున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తు నిర్వహించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సభ విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఇదిలా ఉండగా, చింతకాని సభను జూలై 9న నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. సభ తేదీ, సమయానికి సంబంధించిన అధికారిక ప్రకటన మంగళవారం వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన అనంతరం సభ ఏర్పాట్లు మరింత వేగవంతం కానున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా లోని అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story