- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నపురెడ్డిలో దుమ్ము రేపుతున్న సెంట్రల్ లైటింగ్ పనులు
మండల కేంద్రంలో సాగుతున్న సెంట్రల్ లైటింగ్, రహదారి విస్తరణ పనులు 'అభివృద్ధి' అనే మాటకు అర్థాన్నే మార్చేస్తున్నాయి.

దిశ, అన్నపురెడ్డిపల్లి : మండల కేంద్రంలో సాగుతున్న సెంట్రల్ లైటింగ్, రహదారి విస్తరణ పనులు 'అభివృద్ధి' అనే మాటకు అర్థాన్నే మార్చేస్తున్నాయి. పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నా.. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ మార్గం ఇప్పుడు 'మృత్యుపాశం'లా మారింది. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం, అధికారుల పర్యవేక్షణ లోపం తోడై సామాన్యుడి ప్రయాణం నరకప్రాయమవుతోంది.
నిబంధనలు బేఖాతరు.. కంటిచూపు కరువు!
సాధారణంగా రహదారి పనులు జరుగుతున్నప్పుడు ధూళి లేవకుండా నిరంతరం నీటిని చల్లడం కానీ అన్నపురెడ్డిపల్లిలో ఆ ఊసే లేదు. మంచు ముసుగులా ధూళి.. భారీ వాహనాలు వెళ్తున్నప్పుడు రోడ్డుపై లేస్తున్న దుమ్ము, మంచు ముసుగులా రహదారిని కప్పేస్తోంది. ఎదురుగా వస్తున్న లారీలు, బస్సులు కూడా కనిపించని స్థితిలో ద్విచక్ర వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. రోడ్డును ఇరువైపులా తవ్వి మొరం పోసి వదిలేయడంతో, వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. గత వారం రోజుల్లోనే ఇక్కడ ఐదారు చిన్నపాటి ప్రమాదాలు జరగడం గమనార్హం.
కకా వికలమవుతున్న వ్యాపారాలు
రోడ్డు పక్కన ఉన్న హోటళ్లు, కిరాణా దుకాణాల పరిస్థితి దయనీయంగా ఉంది. అంగళ్లలో సామాగ్రి అంతా దుమ్ముతో నిండిపోతుండటంతో వినియోగదారులు రావడానికి జంకుతున్నారు. "రోజుకు పది సార్లు తుడిచినా దుమ్ము వదలడం లేదు, తినుబండారాలన్నీ పాడవుతున్నాయి" అని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు.
ఆరోగ్య అత్యవసర స్థితి!
నిరంతరం ఈ విషపూరితమైన ధూళిని పీల్చడం వల్ల స్థానికుల్లో శ్వాసకోస సమస్యలు మొదలయ్యాయి. పిల్లలు, వృద్ధుల విలవిల: ఆస్తమా, అలర్జీలతో బాధపడుతున్న వారు ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్నారు. చర్మ వ్యాధులు: గాలిలోని ధూళి కణాలు చర్మంపై చేరి అలర్జీలు కలిగిస్తున్నాయని బాధితులు పేర్కొంటున్నారు.
ప్రశ్నార్థకంగా అధికారుల తీరు
ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేయడం వెనుక ఆంతర్యమేమిటని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
క్షేత్రస్థాయి గొంతుక
నరకం కనిపిస్తోంది. ఈ రోడ్డు మీద వెళ్లాలంటేనే భయమేస్తోంది. ముక్కుకు గుడ్డ కట్టుకున్నా దుమ్ము లోపలికి వెళ్తోంది. కళ్లలో ఇసుక పడి బైక్ కంట్రోల్ అవ్వడం లేదు. అధికారులు స్పందించి వెంటనే నీళ్లు చల్లించాలి పుడూరి రవి వాహనదారుడు.
దుకాణం తెరవలేకపోతున్నాం : బత్తిని శ్రీను స్థానిక హోటల్ వ్యాపారి
"దుమ్ము వల్ల సామానంతా పాడవుతోంది. రోజంతా కష్టపడినా బోణి కూడా అవ్వడం లేదు. నీళ్లు చల్లమని అడిగితే కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు." అని తెలిపారు.
తక్షణమే నీటి లారీలను ఏర్పాటు చేసి, రోజుకు కనీసం 4-5 సార్లు నీళ్లు చల్లాలి.ప్రమాదకరంగా ఉన్న చోట హెచ్చరిక బోర్డులు, రేడియం సూచికలు ఏర్పాటు చేయాలి. పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి సామాన్యుడి ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. అన్నపురెడ్డిపల్లి పంచాయతీ వార్డు సభ్యులు పానుగంటి రాఘవులు చరవాణిలో కాంట్రాక్టర్ ని ప్రశ్నించగా.. ఇప్పుడు బీటీ పోయడం కుదరదు బిల్లులు కాలేదు మా వల్ల కాదు అని నిర్లక్ష్య సమాధానం ఇవ్వడం పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఎమ్మెల్యే, కలెక్టర్ తక్షణమే దృష్టి సారించి పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.






