తండాలో ‘కుల’ రక్కసి.. వృద్ధుడి కుటుంబంపై బహిష్కరణ వేటు!

by Kodari Anjali |   (  Updated:2026-06-08 12:03:36  IST  )

వ్యవసాయదారుడు అయిన మూడ్ వస్త్రం, కాంతి కుటుంబాన్ని తండా పెద్దలు చట్టవిరుద్ధంగా కుల బహిష్కరణ చేసిన ఘటన టేకులపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మూడు తండాలో జరిగింది.

తండాలో ‘కుల’ రక్కసి.. వృద్ధుడి కుటుంబంపై బహిష్కరణ వేటు!
X

దిశ, టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలం, టేకులపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని' మూడు తండా' లో అమానుష ఘటన వెలుగుచూసింది. తండాకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు, వ్యవసాయదారుడు అయిన మూడ్ వస్త్రం, కాంతి కుటుంబాన్ని తండా పెద్దలు చట్టవిరుద్ధంగా కుల బహిష్కరణ చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తండాలో వారి పిన్ని అయిన మూడ్ హీమిలి చనిపోగా, సాంప్రదాయం ప్రకారం తండా వాసులందరి నుండి తండా పెద్దలు డబ్బులు, బియ్యం వసూలు చేశారు. అయితే, బాధితుడి ఇంటిని మాత్రం కనీసం పలకరించకుండా, పిలవకుండా వెలివేశారు. దీనిపై గ్రామస్తులను నిలదీయగా.. తండా నాయక్, కార్భారీల ఆదేశాల మేరకే తాము ఇలా చేస్తున్నామని, వారి ఇళ్లకు ఎవరూ వెళ్లకూడదని ఆంక్షలు విధించారని తెలిపారు.

అక్రమంగా కిరాణా దుకాణాన్ని ఏర్పాటు..

బాధితుడి కుటుంబాన్ని "చేతబడి కుటుంబం" అని నిందిస్తూ, తండా నుండి వెలివేయాలని నోటికి వచ్చిన బూతులు తిడుతూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. తండాలో ఎలాంటి శుభకార్యాలు జరిగినా వీరు రావద్దని, అసలు తండాలోనే ఉండడానికి వీల్లేదని నాయక్, కార్భారీలు గొడవలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇదే కాకుండా, బాధితుడికి చెందిన సొంత స్థలంలో నాయక్, అతని కుమారుడు అక్రమంగా కిరాణా దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ఆ దుకాణాన్ని ఖాళీ చేయాలని అడిగితే బాధితుడిపై కొట్టడానికి వస్తూ, చంపేస్తామని బెదిరిస్తున్నారు. నాయక్, కార్భారీలు చెప్పినట్టు వినకపోతే తండాలో బతకనివ్వమని హుకుం జారీ చేశారు.

కుటుంబానికి రక్షణ కల్పించాలి..

ఈ కుల బహిష్కరణ వల్ల ఇంట్లోని చిన్నపిల్లలు (మనవళ్లు, మనవరాళ్లు) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊరిలో తమతో ఎవరూ మాట్లాడటం లేదని, ఆడుకోవడానికి రావడం లేదని ఆ చిన్నారి పిల్లలు ఏడుస్తూ అడుగుతుంటే గుండె తరుక్కుపోతోందని వృద్ధుడు వస్త్రం, కాంతి కన్నీరుమున్నీరయ్యారు. సమాజంలో ఇంకా ఇలాంటి అనాగరిక దురాచారాలు కొనసాగడం పట్ల స్థానికంగా కలకలం రేగుతోంది. ఇప్పటికైనా టేకులపల్లి పోలీసులు స్పందించి, తమను కుల బహిష్కరణకు గురిచేసి, భూమిని ఆక్రమించి, ప్రాణభయానికి గురిచేస్తున్న తండా పెద్దలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, మంత్రవిద్యల నిరోధక చట్టం కింద కఠిన చర్యలు తీసుకుని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని బాధితుడు మూడ్ వస్త్రం కాంతి గిరిజన సమాజానికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story